స్థాయికి మించి..
అన్నిరకాల వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు
●
అమరచింత: జిల్లాలో కొందరు అనుమతి లేని నర్సింగ్ హోంలు, ఇతరత్రా క్లినిక్‌లు కొనసాగిస్తున్నారు. బీఎంఎస్ చదివిన వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్‌గా అవతారం ఎత్తి స్థాయికి మించి వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. గైనిక్‌లు లేకున్నా ప్రసూతి కేంద్రాలు నిర్వహిస్తూ.. తల్లీబిడ్డల చావులకు కారణమవుతున్నారు. ఇటీవల ఆత్మకూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే డీఎంహెచ్‌ఓ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఓ నర్సింగ్‌హోంను సీజ్ చేశారు. అయితే జిల్లాలో ఈ చర్యలు పూర్తిస్థాయిలో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.
అధునాతన వసతులతో..
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వసతులతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మండల కేంద్రాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం ప్రభుత్వ ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో 156 రకాల మందులు సైతం అందుబాటులో ఉంచుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికంగానే అన్నిరకాల వైద్యం అందిస్తున్నారు. గ్రామాల్లోని ఆశా వర్కర్‌తోపాటు ఏఎన్‌ఎంలు సైతం తమ క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి వైద్యం అందించాలో అన్న విషయాలను ముందస్తుగానే గుర్తించి వారిని ఆస్పత్రులకు తీసుకెళ్తూ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి మండలానికి..
మాతాశిశు సంరక్షణ్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. గర్భిణిగా ధ్రువీకరించినప్పటి నుంచి ప్రసూతి అయ్యే వరకు ఎప్పుడు ఎలాంటి వైద్య సేవలు అందించాలి అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. స్కానింగ్ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లే సదుపాయం కల్పించారు. దీంతో అంగన్‌వాడీ టీచర్ నుంచి ఏరియా ఆశ వర్కర్, ఏఎన్‌ఎంలు గర్భిణికి అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారు. కాన్పులకు ముందస్తుగా వైద్యుల సూచనలతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
నోటీసులు ఇచ్చాం..
జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే జిల్లాకేంద్రంతోపాటు పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింతలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాం. వీటిలో రెండు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశాం. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులకు సైతం సూచనలు చేశాం.
– శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ
జిల్లాలో యథేచ్ఛగా అనుమతి లేని ఆస్పత్రుల నిర్వహణ
చదివింది బీఎంఎస్..
చేసేది ఎంబీబీఎస్ వైద్యం
ప్రజల అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకుని దందా
పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్న
అధికార యంత్రాంగం
జిల్లాలోని 255 గ్రామాల్లో సుమారు 770 కిపైగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు కేవలం తమ వద్దకు వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి వైద్యం కావాలో గ్రహించి వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా వారే నేరుగా ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో అంతకు మించి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ దందా సాగిస్తున్నారు. కొందరు ప్రభుత్వ వైద్యులు సైతం ప్రైవేట్‌గా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు.


