దళారులను నమ్మి మోసపోవద్దు
వనపర్తి రూరల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిట్యాల శివారు వ్యవసాయ మార్కెట్‌యార్డులో మహిళా సమాఖ్య ఽఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌పార్టీ కృషి చేస్తోందని.. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ క్వింటాకు రూ.500 చెల్లిస్తున్నామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు తీసుకొస్తే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ గట్టు రాజు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


