అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
వనపర్తి: భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. సోమవారం ఉదయం పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి, ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుక సభలో ఆయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లలు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని నల్ల చెరువుకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని హరిజన వాడలు, హరిజన పాఠశాలలని పేరు లేకుండా వాటిని కూడా అంబేద్కర్ వాడలు, పాఠశాలలు అని నామకరణం చేయనున్నట్లు వివరించారు. విశ్రాంత ఐఏఎస్ సూచనల మేరకు ప్రతి మండలంలో కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ప్రతి ఒక్కరికి దేవుడని, ప్రతి పేదకు న్యాయం జరగాలని, సమాన హక్కులు కల్పించాలని కలలుగన్నారని చెప్పారు. ప్రతి ఇంటికి అంబేడ్కర్ ఆశయాలను తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళులన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. విద్యార్థులు కనీసం పీజీ వరకు చదువుకోవాలని.. మరింత అభివృద్ధి సాధించి తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. అనంతరం కుల సంఘం నాయకులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం గట్టయ్య, ఉపాధ్యక్షుడు బోజరాజు, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అక్బర్, కులసంఘాల నాయకులు గంధం నాగరాజు, కిరణ్‌కుమార్, బోయ వెంకటేష్, రాజారాం, కేశవులు, మహేశ్, అక్కమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


