
ఎకో పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి
వనపర్తి: జిల్లాకేంద్రం సమీపం మర్రికుంటలో అటవీశాఖ పరిధిలోని ఎకో పార్క్‌లో సైక్లింగ్ ట్రాక్, వాకర్స్‌కి ఆహ్లాదకరంగా ఉండేలా వివిధ రకాల మొక్కలు నాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా అటవీశాఖ అధికారి కేఏవీఎస్ ప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పార్క్‌లోని 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌పై నడుస్తూ నిత్యం ఎంతమంది వస్తున్నారు.. చిన్నారులు, పెద్దలకు టికెట్ ధర ఎంత నిర్ణయించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సూచనలను అటవీశాఖ అధికారికి వివరించారు. నిత్యం పార్క్‌కు వచ్చే వాకర్స్‌కి ఇబ్బందులు కలగకుండా ట్రాక్‌ని శుభ్రంగా ఉంచాలని.. ఎంట్రెనన్స్, పార్క్‌లోని పలు ముఖ్యమైన ప్రదేశాల్లో ఫొటోగ్రఫీకి అనుకూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. చిన్నారులు ఆడుకునే ప్రదేశాల్లో జంతువుల బొమ్మలు, ఆటసామగ్రి ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.