ఆత్మకూర్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం తగదని.. కూలీలందరికి న్యాయం చేయాలని మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక, క్షేత్ర సహాయకులతో ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. భూమి చదును, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, నర్సరీల ఏర్పాటు, ఉపాధి పనుల వద్ద టెంట్లు, తాగునీరు, కూలీల సంఖ్య పెంపు, పనుల పురోగతి తదితర విషయాలపై చర్చించారు. నిర్దేశించిన పనులు నెలాఖరు లోగా పూర్తి చేయాలని, విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీ ఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, ఏపీఓ విజయభాస్కర్‌రెడ్డి, టెక్నికల్ పీఓ రఘు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని.. మంగళవారం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 28 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 96 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.
‘నేటి రాష్ట్ర సదస్సును
విజయవంతం చేద్దాం’
వనపర్తి విద్యావిభాగం: యూజీసీ కొత్త నిబంధనల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలంటూ బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సు లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుందని.. ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ యాదవ్, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డా. మధుసూదన్‌రెడ్డి, పీడీఎస్‌యూ జాతీయ కార్యవర్గసభ్యుడు విజయకన్నా, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకట్‌రెడ్డి, సాంబ, పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
నవోదయ విద్యాలయ
ఫలితాలు విడుదల
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.6,411
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిబహిరంగ వేలం ప్రారంభం అవుతుంది.