వనపర్తి: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని.. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రీస్ విభాగం జనరల్ మేనేజర్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. టీజీ ఐపాస్‌కు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా, డీఐపీసీలో భాగంగా టీ ఫ్రైడ్ స్కీం కింద ఎస్సీ 6, ఎస్టీ 6, ఒక పీహెచ్‌సీకి సంబంధించిన ప్రోత్సాహకాలను కలెక్టర్ మంజూరు చేశారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించండి
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.