యథేచ్ఛగా మట్టి దందా?! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి దందా?!

Published Fri, Mar 21 2025 12:55 AM | Last Updated on Fri, Mar 21 2025 12:51 AM

కరుగుతున్న గుట్టలు

దాడులు చేస్తున్నాం..

జిల్లాకేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములను తవ్వి మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే దాడులు నిర్వహిస్తున్నాం. ఇటీవల శ్రీనివాసపురం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వి తరలిస్తున్నందుకు రూ.20 వేల జరిమానా విధించాం. సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు ఏ ప్రభుత్వ గుట్టల్లో మట్టి తవ్వేందుకు అనుమతి ఇవ్వలేదు.

– గోవింద్‌, ఏడీ, మైనింగ్‌శాఖ వనపర్తి

వనపర్తి: జిల్లాకేంద్రం సమీపంలోని గుట్టలు రోజురోజుకు కరిగిపోతున్నాయి. మైనింగ్‌, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు అక్రమార్కులు పట్టపగలే పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలో పరుగులు పెడుతున్న మట్టి ట్రాక్టర్లే సాక్ష్యం. అధికార పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్న కొందరు మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లాకేంద్రంలో ఈ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురం శివారు, పాన్‌గల్‌ రోడ్‌, రాజనగరం శివారు వడ్డేవాట సమీపంలోని గుట్టలను పొక్లెయిన్లతో తోడేస్తూ భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్‌శాఖ అధికారులు సైతం వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని నామమాత్రపు దాడులు చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తవ్వకాలు చేపడుతున్నట్లు మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే తాము పరిశీలనకు వస్తున్నామని అధికారులు అక్రమార్కులకు సమాచారం అందిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, పొక్లెయిన్లు గుట్టల ప్రాంతంలో కనిపించడం లేదు. శ్రీనివాసపురం శివారులోని గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొందరు అధికారులు, మీడియాకు మంగళవారం సమాచారం ఇచ్చారు. కాసేపటికే అధికారులు అక్కడికి చేరుకోగా.. మట్టితో నిండిన కొన్ని ట్రాక్టర్లు ముళ్లపొదల చాటున కనిపించకుండా నిలపడం, తవ్వకాలు చేసిన చోటే కొంత మట్టిని వదిలేసి వెళ్లడం, పొక్లెయిన్లు అక్కడ లేకుండా అక్రమార్కులు జాగ్రత్తలు పడ్డారు. మైనింగ్‌ అధికారులు కనీసం గుట్ట వద్దకు వెళ్లకుండానే ఎలాంటి తవ్వకాలు లేవని ధ్రువపరుస్తూ కాసేపు అక్కడ గడిపి వెళ్లడం గమనార్హం.

నామమాత్రపు జరిమానాలే..

గుట్టల తవ్వకాలపై అతిగా ఫిర్యాదులు అందితే అధికారులు నామమాత్రపు జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం రూ.లక్షల్లో చేసే మట్టి దందాకు నామమాత్రంగా రూ.వేలల్లో జరిమానాలు విధిస్తే అక్రమ తవ్వకాలు ఎలా ఆగుతాయన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి భవిష్యత్‌ తరాలకు జాతి సంపదను కాపాడాలనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు ప్రజాసంఘాలు కలెక్టర్‌, మైనింగ్‌శాఖ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేయడంతో కొన్ని నెలల పాటు ఈ దందాకు బ్రేక్‌ పడినా ఇటీవల తిరిగి జోరందుకుంది.

అధికార పార్టీ అండదండలతోనే..

అధికార పార్టీలోని కొందరు ముఖ్యనేతల అండదండలతోనే జిల్లాకేంద్రంలో మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా భ యపడేది లేదంటూ సదరు నేత అంటున్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేత గతంలోనూ ప్రైవేటు పట్టా భూమిలో మట్టి తవ్వేందుకు మైనింగ్‌శాఖ నుంచి అ నుమతి తీసుకొని ప్రభుత్వ గుట్టలు తవ్వగా అధికారు లు గుర్తించి పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.

అధికారులు వస్తున్నారని తెలిసి ముళ్లపొదల చాటున

కనబడకుండా నిలిపిన మట్టి ట్రాక్టర్లు

నామమాత్రపు జరిమానాలతో

సరిపెడుతున్న మైనింగ్‌ అధికారులు

అధికార పార్టీ నేతల

అండదండలతోనేనా..?

అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్లు అక్రమార్కులు ముందుగానే తెలుసుకొని మట్టి ట్రాక్టర్లను ముళ్లపొదల చాటున కనపడకుండా నిలిపి జాగ్రత్తలు తీసుకోవడం కనిపించింది. శ్రీనివాసపురం శివారులోని ఎత్తైన గుట్టలను పొక్లెయిన్లతో తవ్వినట్లుగా గుట్టలపై స్పష్టంగా గుర్తులు కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరిపేందుకు గుట్టపై ఉన్న చెట్లను సైతం తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయి.

యథేచ్ఛగా మట్టి దందా?! 1
1/1

యథేచ్ఛగా మట్టి దందా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement