వనపర్తి: పోలీసు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సీఐలు, ఎస్‌ఐలను ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి.. వాటిని సత్వర పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్‌ల ఎస్‌ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.
లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోలేం..
అమరచింత: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని.. లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోవడం కష్టమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బట్టి పట్టే చదువులకు స్వస్తి పలకాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. నిత్యం ఉపాధ్యాయులను గౌరవించినప్పుడే చక్కగా అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఉపాధ్యాయులు ఏది చెప్పినా విద్యార్థులు వినే వారని.. అందుకే ఉన్నతంగా రాణించి మంచి ఉద్యోగాలు సాధించారన్నారు. నేటి తరం విద్యార్థుల్లో కొందరు సెల్‌ఫోన్ వినియోగించడం ద్వారా చదువుల్లో రాణించలేక పోతున్నారని తెలిపారు. విద్యార్థి ఏ రంగంలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడో గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులంలో చదువుతున్న పూర్ణ అనే విద్యార్థినిలో ఉన్న లక్ష్యాన్ని అప్పటి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ గుర్తించి, తోడ్పాటు అందించడంతో ఎవరెస్టు శిఖరం ఎక్కి ప్రపంచ గుర్తింపు తెచ్చుకుందని గుర్తుచేశారు. పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, హెచ్‌ఎం కృష్ణవేణి, రిటైర్డ్ టీచర్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు.