కొత్తకోట రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మండలంలోని వడ్డెవాటకు చెందిన మండ్ల పవన్‌కుమార్ 510 మార్కులు సాధించి సత్తా చాటారు. తండ్రి వెంకటస్వామి స్థానిక సర్కిల్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
సమయస్ఫూర్తి
కోల్పోవద్దు
వనపర్తిటౌన్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశ, అత్యాశతోనే ఉన్న నగదును కోల్పోవాల్సి వస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, వనపర్తి సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధానమంత్రి కౌశల్ యోజన శిక్షణ కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు చూపే ఆశకు లోనుకాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. తెలియని వెబ్‌సైట్లను ఓపెన్ చేసి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసేందుకు న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు, పోక్సో, మోటార్ వెహికిల్, బాలకార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. శిక్షణ కేంద్రం నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు పాటుపడాలి
మదనాపురం: మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. సోమవారం రాత్రి మండలంలోని అజ్జకొల్లులో ఐద్వా గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అధ్యక్ష కార్యదర్శులు స్వాతి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రేణుక, రమాదేవి, శిరీష, కృష్ణవేణి పాల్గొన్నారు.
ఆ భూములు
గిరిజనులకే దక్కాలి
ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు.
గ్రూప్–1లో సత్తాచాటిన వడ్డెవాట యువకుడు
గ్రూప్–1లో సత్తాచాటిన వడ్డెవాట యువకుడు


