సాగునీటికి గడ్డుకాలం! | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి గడ్డుకాలం!

Sep 27 2023 12:48 AM | Updated on Sep 27 2023 12:48 AM

వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి శివారులో నెర్రెలుబారిన వరిపంటను చూపుతున్న రైతు  - Sakshi

వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి శివారులో నెర్రెలుబారిన వరిపంటను చూపుతున్న రైతు

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు బత్తుల మల్లయ్య. భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ 27 ప్రధాన కాల్వకింద ఉన్న రెండెకరాల్లో రూ.40 వేల పెట్టుబడితో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వేరుశనగ సాగుచేశారు. కొన్నిరోజులుగా కాల్వ నీరు రాకపోవటం, వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఇక లాభం లేదని పంటను వదిలేసి ఉన్న గొర్రెల పెంపకంపై దృష్టి సారించారు.

వరిపంట నెర్రెలుబారింది..

రూ.1.20 లక్షల పెట్టుబడితో నాలుగు ఎకరాల్లో వరి, మరో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ ప్రధానకాల్వ ద్వారా సాగునీరు అందక వరి పంట నెర్రెలుబారింది. వేరుశనగ ఎండుముఖం పట్టగా.. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్దిగా తిరగబడింది. సరిపడా నీరందకపోతే ఊడలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

– సత్యం, రైతు, సంగినేనిపల్లి (వీపనగండ్ల)

అఽధికారుల నిర్లక్ష్యంతోనే..

భీమా అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు ఓ వైపు ఎక్కువగా.. మరోవైపు తక్కువగా పారుతోంది. నీరందక పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నా.. పట్టించుకోవటం లేదు. చేసేది లేక అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాం. – రాజవర్ధన్‌రెడ్డి, రైతు,

సంగినేనిపల్లి (వీపనగండ్ల)

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..

సమస్య మా దృష్టికి వచ్చింది. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. పూడిక తొలగింపు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నేటికీ కాంట్రాక్టర్‌ కాల్వ పనులు పూర్తిచేసి అప్పగించలేదు.

– కిరణ్‌, డీఈఈ, భీమా ఫేజ్‌–2, పెబ్బేరు

వనపర్తి: అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని వీపనగండ్ల మండలం పుల్గరచర్ల, కల్వరాల, సంగినేనిపల్లి, వీపనగండ్ల, తూంకుంట, సంపట్రావ్‌పల్లిలోని భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ 27 చివరి ఆయకట్టుకు కొంతకాలంగా సాగునీరు అందటం లేదు. దీంతో వెయ్యికిపైగా ఎకరాల్లో సాగుచేసిన వరి, వేరుశనగ, మినుము పంటలు ఎండిపోతున్నాయి. భీమా అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వచ్చిన ఆయా గ్రామాల రైతులు తమ సమస్యను అదనపు కలెక్టర్‌ ఎస్‌.తిరుపతిరావుకు విన్నవించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాన్‌గల్‌, వీపనగండ్ల మండలాల్లోని భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ 27 ప్రధాన కాల్వతో సుమారు 16 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా... కాల్వలు తవ్విన దశాబ్ద కాలం తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఐదేళ్లుగా సాగునీరు పారుతోంది. కాంట్రాక్టర్‌ కాల్వ పనులు పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేశారనే నెపం చూపుతూ అధికారులు ఏటా వేసవిలో కాల్వల పూడికతీత చేపట్టకపోవడంతో భీమా కాల్వలో జమ్ము, మట్టి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహానికి అవరోధంగా మారినట్లు రైతులు వాపోతున్నారు. పుల్గరచర్ల వద్ద ఈ కాల్వ నుంచి గంగారం, గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ వైపునకు వెళ్లే డి–20 డిస్ట్రిబ్యూటరీ కాల్వను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు వేసవిలో మరమ్మతు చేయించడంతో పాటు లోతుగా తవ్వడం, ప్రధానకాల్వలో పూడిక పేరుకుపోవడంతో నీరు ముందుకు పారక చివరి ఆయకట్టు పంటలకు అందక ఎండుతున్నాయని రైతులు తెలిపారు.

అధ్వానంగా భీమా ఫేజ్‌–2 ప్రధాన కాల్వ

పూడిక తొలగింపుపై

అధికారుల నిర్లక్ష్య ధోరణి

చివరి ఆయకట్టుకు అందని సాగునీరు

వేల ఎకరాల్లో పంటలు ఎండుముఖం

విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు

పిల్ల కాల్వలా మారిన భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ 27 ప్రధాన కాల్వ 1
1/5

పిల్ల కాల్వలా మారిన భీమా ఫేజ్‌–2 ప్యాకేజీ 27 ప్రధాన కాల్వ

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement