వేరుశనగకు డిమాండ్
● ప్రస్తుత యాసంగిలో సాగు విస్తీర్ణం 24,738 ఎకరాలే..
● మినుము సాగుకు
ఆసక్తి చూపుతున్న రైతులు
● మార్కెట్‌లో జోరుగా సాగుతున్న
పల్లి విక్రయాలు
●
వనపర్తి: జిల్లాలో వరుసగా రెండేళ్లు వేరుశనగ ధరలు ఆశాజనకంగా లేకపోవడం.. పంట సాగుకు రాత్రి, పగలు శ్రమించాల్సి రావడంతో రైతులు ప్రస్తుత యాసంగిలో మినుము సాగుకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్‌కు వేరుశనగ పంట ఉత్పత్తుల రాక తగ్గడంతో ప్రస్తుతం క్వింటా రూ.9,269కు చేరింది. కనిష్ట మద్దతు ధర రూ.7,263 ఉండగా.. జిల్లాకేంద్రంలోని మార్కెట్‌లో గరిష్టంగా 9,269.. కనిష్టంగా రూ.4,444 ధర పలుకుతోంది. నాణ్యమైన వేరుశనగకు గరిష్ట, సాధారణ ధరలు సైతం కనిష్ట మద్దతు ధర కంటే అధికంగా రూ.7,699 పలుకుతుండటంతో పంట సాగు చేయని రైతులు నిరాశకు గురవుతున్నారు.
పెరిగిన మినుము సాగు..
జిల్లా రైతులు ప్రస్తుత యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి తర్వాత అత్యధికంగా మినుము సాగునే ఎంచుకున్నారు. మార్కెట్‌లో ధరలు మాత్రం గతంతో పోలిస్తే ఆశాజనకంగా లేవనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో క్వింటా రూ.9 వేలకు పైగా ఉండగా.. ప్రస్తుతం రూ.7,600లకు మించడం లేదు. దీంతో రైతులు చేసేది లేక రవాణా ఖర్చులు మిగులుతాయని పొలం వద్దే దళారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఏమిటీ మార్కెటింగ్ మాయ..?
రాత్రింబవళ్లు కష్టపడే రైతులను మార్కెట్‌లో ఎప్పటికప్పుడు చిన్నబుచ్చుతూనే ఉన్నారు. ప్రతిసారి మార్కెట్‌లో ఎక్కువగా పండించిన పంటలకు ధర లభించకోవడం.. తక్కువగా సాగు చేసిన మెట్ట పంటల ధరలు పెరగడం మార్కెటింగ్ మాయనా, లేక వాస్తవంగా ధరలు అలాగే ఉంటాయా? అనే విషయం తేలాల్సి ఉంది.
8,500 క్వింటాళ్ల విక్రయాలు..
స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో 40 రోజుల వ్యవధిలో 8,500 క్వింటాళ్ల వేరుశనగ విక్రయాలు జరిగాయి. క్వింటా గరిష్టంగా రూ.9,269, కనిష్టంగా రూ.4,444.. సాధారణ ధర రూ.7,499 పలికినట్లు అధికారుల రికార్డులతో స్పష్టమవుతోంది.
జిల్లాలో క్వింటా గరిష్టంగా రూ.9,269


