స్వచ్ఛతకు పెద్దపీట : డీపీఓ
వనపర్తి రూరల్: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని డీపీఓ తరుణ్ చక్రవర్తి సర్పంచ్‌లకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామపంచాయతీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా పెద్దగూడెంలో సర్పంచ్ పుష్పలత, ఉపసర్పంచ్ భారతయ్య, వార్డుసభ్యులు డీపీఓను శాలువాతో సన్మానించారు. కడుకుంట్లలో సర్పంచ్ తిరుపతయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మొక్కలు వాడుముఖం పట్టకుండా నిత్యం నీరందించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు కోరారు. ఆయన వెంట కార్యదర్శులు మల్లికార్జున్, చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కురుమూర్తి, ఆయా గ్రామస్తులు శివకుమార్, కొండన్న, విష్ణు, బుచ్చిబాబు, రవిశెట్టి, నహీం పాషా, గ్రామ పెద్దలు ఉన్నారు.
వ్యవసాయ కళాశాలకు పక్కా భవనం కరువు
వనపర్తి రూరల్: ఎంజేపీ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం లేక జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెద్దగూడెం శివారులోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. 2022లో జిల్లాకు కళాశాల మంజూరుకాగా ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. కోళ్ల షెడ్డులో కొనసాగుతున్న కళాశాలలో విద్యార్థులు విషపు పురుగులకు భయపడుతూ చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో 336 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని.. కలెక్టర్, ఎమ్మెల్యే తక్షణమే కళాశాలను సందర్శించి పక్కా భవనం నిర్మించాలని కోరారు. లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దేవర శివ, అంజన్నయాదవ్, ధరేంద్రసాగర్, రాఘవేందర్‌గౌడ్, అస్కని రమేష్, రామన్‌గౌడ్, రమేష్‌గౌడ్, కురుమూర్తి, గౌతమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతకు పెద్దపీట : డీపీఓ


