హరిత సంరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం
వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేషనల్ గ్రీన్ క్రాప్స్ డైరెక్టర్, హైదరాబాద్ ఆదేశాలనుసారం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లోని 8, 9వ తరగతి విద్యార్థుల కోసం వేస్ట్ టూ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపితే పచ్చదనం పదిలంగా ఉంటుందన్నారు. ఇందులో విద్యార్థులు భాగస్వాములవడంతో వారి కుటుంబం మొత్తం భాగమవుతారని, దీంతో పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు యధాస్థితికి వస్తాయని చెప్పారు. పరిసరాల్లోని వ్యర్థాలను అర్థవంతమైన వస్తువులుగా మార్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ఆకర్షణీయమైన కళారూపంగా తీర్చిదిద్దవచ్చని ప్రదర్శన ద్వారా విద్యార్థులు రుజువు చేశారని అభినందించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, కేతేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.2 వేలు, బాలుర ఉన్నత పాఠశాలకు మూడో బహుమతిగా రూ.వెయ్యి అందజేసినట్లు ఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.సుదర్శన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


