అక్రమ మైనింగ్ నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలోని పోలీసు, ఇరిగేషన్, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో అక్రమ మైనింగ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సూచన మేరకు సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు కీలక మార్గాలు గుర్తించాలని.. కీలక ప్రాంతాల నివేదిక ప్రభుత్వానికి అందించిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సీఐ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రోవర్స్ పనితీరుపై శిక్షణ..
భూమి కొలతలు అత్యంత కచ్చితత్వంగా గుర్తించే రోవర్స్ పరికర పనితీరుపై శిక్షణ పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. భూ భారతి చట్టం ప్రకారం భూదార్ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 70 గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించేందుకు మూడు రోవర్స్ యంత్రాలు పంపించినట్లు తెలిపారు. గురు, శుక్రవారం జిల్లాలోని 10 మంది సర్వేయర్లకు పోలీస్ పరేడ్ మైదానంలో శిక్షకుడు చంద్రకాంత్ శిక్షణ ఇవ్వగా శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోవర్స్ ఉపయోగించి భూ కొలతలు ఏ విధంగా చేపట్టాలి.. ఎలాంటి ప్రామాణికలు తీసుకోవాలనే అంశాలను బాగా నేర్చుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. తర్వాతి కాలంలో యంత్రాల వినియోగంపై లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సైతం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తిచేసి భూదార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సర్వే ల్యాండ్ పి.శ్రీనివాస్, ఎస్‌డీఎం శిల్ప, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


