
కొంకలపల్లి కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
గోపాల్‌పేట: ఏదుల ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన కొంకలపల్లి, బండరావిపాకుల పునరావాస కేంద్రాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేసి తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రేవల్లి మండలం చెన్నారం, గొల్లపల్లి, కొంకలపల్లి, కొత్తబండరావిపాకులలో ఆయన పర్యటించారు. మొదట చెన్నారం గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలకు నీరు పట్టారు. తర్వాత సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న పంటను పరిశీలించి పెట్టుబడి ఎంత.. మిగులుబాటు అవుతుందా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి కొంకలపల్లి ఆర్‌అండ్‌ఆర్ కేంద్రాన్ని సందర్శించారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయని ప్రాజెక్టు డీఈ సత్యనారాయణ గౌడ్‌ని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లు, నీటి సౌకర్యం, డ్రెయినేజీల పనులు త్వరగా పూర్తి చేయా లని ఆదేశించారు. అనంతరం కొత్తబండరావిపాకు ల ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌ను పరిశీలించారు. సీసీ రోడ్లు వీలైనంత త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంచినీటి సరఫరాలో ఇబ్బందులున్నాయని స్థానికులు చెప్పటంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట ఎంపీపీ సేనాపతి ఉన్నారు.
‘స్వచ్ఛ’ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలి
వనపర్తి: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ స్వచ్ఛ సర్వేక్షణ్–2023 లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో జనాభా ఆధారంగా స్వచ్ఛభారత్ సర్వేక్షణ్ కార్యక్రమాలు నిర్వహించి నివేదిక రూపొందించాలన్నారు. మే నెల 1 నుంచి జూన్ 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఎంపీడీఓలు అధికారుల బృందంతో కలిసి పర్యటించాలన్నారు. వ్యర్థాలు లేని, వీధులు శుభ్రంగా ఉండే, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో ముందున్న గ్రామాల డాక్యుమెంటరీ రూపొందించుకోవాలని, ప్రతి గ్రామంలో సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వార్డుసభ్యులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2023లో భాగంగా ఉత్తమ గ్రామపంచాయతీలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీలు నీటి, వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రవణ్‌కుమార్, డీఆర్డీఓ నర్సిహులు, డీపీఓ సురేష్‌కుమార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఎఫ్‌పీఓల ఏర్పాటులో నాబార్డుదే కీలకపాత్ర..
ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ) ఏర్పాటులో నాబార్డు కీలకపాత్ర పోషించిందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ప్రశంసించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో నాబార్డు, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దమందడి, ఖిల్లాఘనపురం, కొత్తకోట మండలాల్లో ఎఫ్‌పీఓల ఏర్పాటుకు పాలమూరు సీడ్స్ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదించా రు. సభ్యత్వాల పెంపు, నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
అయిదు నెలల ఉచిత శిక్షణ..
వనపర్తి: మహబూబ్‌నగర్‌లో కొనసాగే ఫౌండేషన్ కోర్సుల రెసిడెన్షియల్ శిక్షణ తరగతులకు ఆసక్తిగల అభ్యర్థులు www.tsstudycirc le.com.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీకి సంబంధించి అయిదు నెలల పాటు శిక్షణ ఇస్తారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వంద మంది నిరుద్యోగులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.