5న జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

5న జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా ఎంపికలు

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● రాష్ట్ర స్థాయి పోటీలకు జట్ల ఎంపిక

● డీఎస్‌డీఓ డా. కె. శ్రీధర్‌ రావు

పార్వతీపురం రూరల్‌: జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) డా. కె. శ్రీధర్‌ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎంపికలు జరగనున్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తవలసలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో 12 అథ్లెటిక్స్‌ ఈవెంట్లు నిర్వహిస్తారు. అలాగే ఫైర్‌ ఆఫీస్‌, ఆఫీసర్స్‌ క్లబ్‌ సమీపంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌, వీల్‌ చైర్‌ ఫెన్సింగ్‌, బ్లయిండ్‌ గోల్‌బాల్‌, తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు జరుగుతాయి. జిల్లాకు చెందిన బాలబాలికలు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అర్హులు. వయస్సు కేటగిరీల వారీగా బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయి. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని డిసెంబర్‌ 1, 2 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. వివరాలకు హ్యాండ్‌బాల్‌ శిక్షకుడు కె. గణేష్‌ ఫోన్‌ 9866805716నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నర్సింగ్‌ ఉద్యోగాల

సమాచారం అవాస్తవం

విజయనగరం ఫోర్ట్‌: వైద్య ఆరోగ్యశాఖలో బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయుచున్నామని, ఉద్యోగాలు కల్పిస్తామని వ్యక్తిగతంగా ఈశాఖకు సంబంధం లేని వ్యక్తుల నుంచి ఇటీవల వస్తున్న సమాచారం పూర్తి అవాస్తవమని డీఎంహెచ్‌ఓడాక్టర్‌ ఎస్‌. జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. తమ శాఖ నుంచి ఉద్యోగాలు నింపేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు.

ఇద్దరు గంజాయి నిందితులపై పీడీ యాక్ట్‌

తెర్లాం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినట్లు తెర్లాం ఎస్సై బి.సాగర్‌బాబు బుధవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, విక్రయాలకు పదేపదే పాల్పడుతున్న వ్యక్తులపై ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశాల మేరకు బొబ్బిలి రూరల్‌ సీఐ మల్లికార్జునరావు ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే తెర్లాం మండలం టెక్కలివలస గ్రామానికి చెందిన ముదిలి తరుణ్‌కుమార్‌, గరివిడి మండలం బాగువలస గ్రామానికి చెందిన గొండేల దిలీప్‌కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులను పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసి బుధవారం విశాఖపట్నంలోని సెంట్రల్‌ జైల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

5,540 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం

● 25 లీటర్ల సారా స్వాధీనం

● 9 మందిపై కేసు నమోదు

సీతంపేట: మండలంలోని పలు గ్రామాల్లో అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు విజయనగరం సహాయ కమిషనర్‌ పి.రామచంద్రరావు ఆదేశాలతో సారా బట్టీలపై బుధవారం దాడులు చేసినట్లు పాలకొండ ఎకై ్సజ్‌ సీఐ సూర్యకుమారి తెలపారు. ఈ మేరకు సారా తయారీకి సిద్ధం చేసిన మొత్తం 5,540 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. కుశిమిగూడ, మండ, చిన్నబగ్గ, గోరపాడు, చిన్నబగ్గకాలనీ తదితర గ్రామాల్లో దాడులు చేసి 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 9 మంది నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సారా తాగడం వలన కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్‌ అబ్కారీ సూపరింటెండెంట్‌ కృష్ణకిశోర్‌ రెడ్డి, పీఎం రామారావు, ఎం.వీ గోపాలకృష్ణ, కురుపాం సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు కృష్ణారావు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొట్లాట కేసుల్లో ముగ్గురి అరెస్ట్‌

● 14 రోజుల రిమాండ్‌

● ఎస్‌.కోట సబ్‌జైలుకు తరలింపు..

వేపాడ: ఆస్తి తగాదాల నేపథ్యంలో నమోదైన కొట్లాట కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వల్లంపూడి ఎస్సై ఎస్‌.సుదర్శన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఆస్తి వివాదాలకు సంబంధించి వీలుపర్తి గ్రామానికి చెందిన గోకేడ పవన్‌కుమార్‌, వల్లంపూడి గ్రామానికి చెందిన గోకేడ ఈశ్వరరావు, గోకేడ మహేష్‌లపై కొట్లాట కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా నిర్ధారించి బుధవారం అరెస్టు చేశారు.అనంతరం వారిని రిమాండ్‌ నిమిత్తం కొత్తవలస కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నిందితులను ఎస్‌.కోట సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement