● బాధితులకు అందజేసిన ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కొద్దిరోజుల్లోనే సైబర్ సెల్ పోలీసులు ట్రాక్ చేసి రూ. 40 లక్షల విలువైన, వివిధ బ్రాండ్‌లకు చెందిన 200 మొబైల్స్‌ను బాధితులకు అందజేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల మొబైల్ ఫోన్ వివరాలను సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌లో నమోదు చేసి, వాటిని ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను వినియోగిస్తున్నామన్నారు. పోగొట్టుకున్న మొబైల్ వివరాలను బాధితులు స్థానిక పోలీసుస్టేషన్ లేదా సైబర్ సెల్, నేరుగా పోర్టల్‌లో నమోదుచేయవచ్చన్నారు. ట్రాక్ చేసిన మొబైల్స్‌లో చాలా వరకూ బాధితుల అజాగ్రత్త కారణంగానూ, ప్రయాణాల్లోనూ, చార్జింగ్ పెట్టే సమయాల్లో చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. సైబర్ సెల్ పోలీసులు, సిబ్బంది కొద్దిరోజులుగా శ్రమించి 200 ఫోన్‌లను రికవరీ చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకూ కోటీ రూ. 50 లక్షల విలువైన 750 ఫోన్‌లను ఈ ఏడాది అందజేశామన్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో తప్పనిసరిగా శక్తియాప్‌ను నిక్షిప్తం చేసుకోవాలని, ఆపద సమయాల్లో ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేసి, పోలీసుల సహాయం పొందాలని సూచించారు. తగిన రసీదు, ఆధారాలు లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పాత మొబైల్స్‌ను కొనుగోలు చేయవద్దని, వాటివల్ల చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చన్నారు. ఎవరికై నా మొబైల్ దొరికితే వాటిని వినియోగించకుండా, స్థానిక పోలీసుస్టేషన్‌కు అప్పగించాలని సూచించారు. ఈ సందర్భంగా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు తిరిగి వారి మొబైల్ చూసుకుని ఆనందంతో సైబర్ సెల్ పోలీసులకు, ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపి, ఆనందం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసి, బాధితులకు అందజేయడంలో ప్రతిభ కనబర్చిన సైబర్ సెల్ సీఐ శోభన్‌బాబు, ఎస్సై ఆర్.జయంతి, సిబ్బంది శ్రీనివాసరావు, రాజేష్, సతీష్‌లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ. లీలారావు, తదితరులు పాల్గొన్నారు.


