● మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
డెంకాడ: విశాఖ–శ్రీకాకుళం జాతీయ రహదారిపై డెంకాడ మండలంలోని లింగాలవలస జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై ఎ.సన్యాసినాయుడు, ఫిర్యాదుదారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి స్వగ్రామమైన పూసపాటిరేగ మండలంలోని స్వగ్రామం తిప్పలవలసకు ద్విచక్రవాహనంపై చోడిపిల్లి పెదకొర్లయ్య(22), వాసుపల్లి అప్పన్న(కొండ)(22) వస్తున్నారు. లింగాలవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ లారీతో నిర్లక్ష్యంగా పక్కకు రావడంతో వెనుకనుంచి వస్తున్న మోటార్ సైకిల్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చోడిపిల్లి పెదకొర్లయ్య, వాసుపల్లి అప్పన్నలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో పెదకొర్లయ్య మరణించాడు. తీవ్రంగా గాయపడిన వాసుపల్లి అప్పన్న జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మరణించిన చోడిపల్లి పెదకొర్లయ్య విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. మృతుడి సోదరుడు కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటికి మరమ్మతులు చేయించేందుకు వారు స్వగ్రామైన తిప్పలవలస వస్తున్నారు.
రక్తపు మడుగులో ఉన్న యజమాని వద్ద శనకం
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర రక్తస్రావంతో నేలపడి ఉన్న యజమాని చోడిపిల్లి పెదకొర్లయ్య పెంచిన శనకం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ ప్రాంతం రక్తంతో ఉన్నా ఆ రక్తపు మడుగులో నేలపై పడిఉన్న యజమాని పెద్దకొర్లయ్యను శునకం వీడకుండా ఆయన పొట్ట భాగంలోనే ఉండిపోయింది. పెంచిన మమకారం చూపిందా శునకం.


