వారోత్సవాల వేళ..
మెరకముడిదాం: ఇటీవల ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు నిధుల బకాయి బెడద వెంటాడుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 41 గ్రంథాలయాల్లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయా లైబ్రేరియన్లు నిర్వహిస్తున్నారు. అయితే నిధుల కొరతతో నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలకు కలిపి రూ.11 లక్షల నిధులను కేటాయించారు. దీంతో గ్రంథాలయ శాఖాధికారులు ఒకేసారి 10 వేల పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా రూ. 10 లక్షల నిధులు కేటాయించామని చెబుతున్నారే కానీ ఇంతవరకూ ఒక్క పుస్తకం కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అయితే జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి సెస్ రూపంలో లక్షల్లో వసూలు చేస్తున్నప్పటికీ గ్రంథాలయాలకు కేటాయించాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో గ్రంథాలయాలను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఇంటిపన్ను వసూలు చేస్తున్నా మంజూరు కాని నిధులు
అయితే ప్రతి గ్రామంలో ఇంటిపన్ను రూపంలో వసూలు చేస్తున్న మొత్తం నుంచి 8 పైసల వరకు గ్రంథాలయాలకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా నిధులను కేటాయించకపోవడమే ఈ నిధుల కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో ఈ గ్రంథాలయాల్లో వేలకొద్దీ పుస్తకాలను అందుబాటులో ఉంచేవారు, అలాగే ప్రతి ఏడాది కొత్త పుస్తకాల కొనుగోలుకు కొంతమొత్తంలో నిధులను కేటాయించే వారు. ఈ మొత్తంతో గ్రంథాలయాల్లో నిరుద్యోగ యువతకు అవసరమైన కాంపిటేటివ్ ఉద్యోగాలకు చెందిన పుస్తకాలు, అలాగే మిగిలినవారికి అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేవారు. అయితే గత రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ గ్రంథాలయాలకు ఎలాంటి నిధులను కేటాయించకపోవడంతో కొత్త పుస్తకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఉద్యోగాావకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు అవసరమైన కొత్తపుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో తమకు వచ్చిన ఉద్యోగావకాశాలను చేజార్చుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సిలబస్ మారడంతో పాతపుస్తకాలతో ప్రయోజనం శూన్యమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 41 శాఖా
గ్రంథాలయాలకు విడుదల కాని నిధులు
రెండున్నరేళ్లుగా కొనుగోలు లేని
కొత్తపుస్తకాలు
ఉద్యోగావకాశాలను వదులుకుంటున్న యువత


