కార్తీక మాసంలో భద్రతా చర్యలు: ఎస్పీ ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

కార్తీక మాసంలో భద్రతా చర్యలు: ఎస్పీ ఆదేశాలు

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

● గ్రామపంచాయతీ ఎన్నికల

హ్యాండ్‌బుక్‌ ఆవిష్కరణ

పార్వతీపురం రూరల్‌: కార్తీక మాసం నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, నదీ ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తగిన పోలీసు బందోబస్తు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. దేవాలయాలు, నదీ ఘాట్‌ల వద్ద అంచనా భక్తుల సంఖ్యకు అనుగుణంగా పోలీసు సిబ్బందిని మోహరించాలని, ప్రవేశ– నిష్క్రమణలు, క్యూల నిర్వహణను క్రమపద్ధతిలో చేపట్టాలని సూచించారు. లోతైన నీటి ప్రాంతాలను గుర్తించి బారికేడ్లు, తాడులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పుణ్యస్నానాలు, నూనెదీపాలు వదులుతున్నవారిపై నిఘా ఉంచాలని తెలిపారు. ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ఏర్పాట్లు, చైన్‌ స్నాచింగ్‌, జేబుదొంగతనాల నివారణకు సాదాదుస్తుల సిబ్బంది నియామకం, సీసీటీవీ, డ్రోన్‌ నిఘా వినియోగం, అంతర్‌ శాఖల సమన్వయం, రిజర్వ్‌ సిబ్బంది సిద్ధతపైనా ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌డీపీఓలు, సీఐలు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని, ఎస్‌హెచ్‌ఓలు స్థలంలోనే ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల హ్యాండ్‌బుక్‌ ఆవిష్కరణ..

ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఎన్నికలు–2026 కోసం రూపొందించిన పోలీస్‌ అధికారుల హ్యాండ్‌బుక్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వరకు ప్రతి దశలో పోలీసు బాధ్యతలు, ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, చెక్‌పోస్టులు, క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు, నగదు–మద్యం–ఆయుధాల నియంత్రణ, 48 గంటల నిశ్శబ్ద కాలం, ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక సూచనలు, చెక్‌లిస్టులు ఇందులో పొందుపరిచారు. హ్యాండ్‌బుక్‌ను అధ్యయనం చేసి విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్‌పీలు సీహెచ్‌.వి.శేషయ్య, థామస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement