● పార్టీకి, పదవులకు రాజీనామా
శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాజు, ఆమె అనుచరులు స్పష్టంచేశారు. బొడ్డవర గ్రామంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సుధారాజు మాట్లాడారు. 14 మంది మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలతో కలిసి టీడీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపునకు కృషిచేస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ప్రస్తుత ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ మోసం చేశారన్నా రు. ఎలాంటి పదువులు, గౌరవం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ తమ వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యపు ధోరణితో చూడటం, మాట్లాడటం మనస్థాపానికి గురిచేసిందన్నారు. ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో అన్యాయం చేశారన్నారు. మాజీ జెడ్పీచైర్మన్ చిన్నశ్రీను సర్దుబాటుచేసిన ఐదు స్థానాలు కూడా కేటాయించలేదని, నచ్చితే పార్టీ కోసం పనిచేయాలని లేదంటే మానేయాలని ఇక్కడి నేతలు తేల్చిచెప్పారన్నారు. ఈ తరుణంలో విలువ లేని పార్టీలో ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేమని, అధినాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటి అప్పారావు, మాజీ సర్పంచ్ జి.సంతోషికుమారి, మురళీరాజుతో పాటు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.


