● ఒడిశాకు ఆటోల్లో అక్రమంగా రవాణా
● రెండు ఆటోలు సీజ్, 6ఎ కేసు నమోదు
పార్వతీపురం రూరల్: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామమైన బట్టివలస వద్ద విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు ఆటోల్లో ఒడిశాకు రవాణా అవుతున్న సుమారు 1,000 కిలోల (టన్ను) చౌక బియ్యాన్ని దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. కవిటిభద్ర గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఆటోలో 700 కిలోల రేషన్ బియ్యాన్ని ఒడిశాకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో మరికి గ్రామానికి చెందిన మరో వ్యక్తి సైతం తన ఆటోలో బియ్యాన్ని సరిహద్దు దాటిస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో టన్ను బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు ఆటోలను సీజ్ చేసి, బాధ్యులపై 6 ఎ కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా పట్టుబడిన బియ్యాన్ని స్థానిక సీఎస్డీటీ కల్యాణ్ చక్రవర్తి పర్యవేక్షణలో డీలర్ వద్ద సురక్షితంగా భద్రపరిచారు. సీజ్ చేసిన ఆటోలను రూరల్ పోలీసు స్టేషన్న్కు తరలించారు.
గ్రామాల్లోని కార్డుదారుల నుంచి ప్రతినెలా ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటిని ప్రత్యేక గోదాంలో నిల్వ ఉంచి ఒడిశాలోని అలమండకు రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు విజిలెనన్స్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.


