పాడేరు రూరల్: మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలబాలికల రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు పోటీలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ టి. నిశాంతి హాజరై విజేతలకు షీల్డులు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో విశాఖ జిల్లా జట్టు ప్రథమ స్థానం, విజయనగరం ద్వితీయ స్థానం, నెల్లూరు తృతీయ స్థానం, చిత్తూరు నాలుగో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో విజయనగరం జట్టు ప్రథమ స్థానం, విశాఖ ద్వితీయ స్థానం, తూర్పుగోదావరి తృతీయ స్థానం, అనంతపురం నాలుగో స్థానం దక్కించుకున్నాయి.
జాతీయ స్థాయికి 24 మంది ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.


