● నిబంధనలు ఉల్లంఘించిన
5 దుకాణాలపై కేసులు
● పర్యవేక్షించిన జిల్లా జాయింట్
కలెక్టర్ ఆర్.వైశాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని బియ్యం, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో శుక్రవారం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్యాకేజీలపై నిబంధనల ఉల్లంఘన, తూకాల్లో తేడాలను అరికట్టేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పౌరసరఫరాల అధికారి బండి అశోక్, డీఎం బాలాజీ రామ్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె.మధు సంతోష్ కుమార్లతో పాటు విజిలెన్స్ అధికారులు పార్వతీపురం, సాలూరు, కురుపాం, మక్కువ మండలాల్లోని దుకాణాలను పరిశీలించారు. బియ్యం బస్తాలపై ముద్రించిన నికర బరువు, గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ), ఇతర ప్యాకేజీ వివరాలను, తూకాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 16 వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు కేసులు బియ్యం బస్తాల్లో తక్కువ తూకం (షార్ట్ ఫిల్లింగ్)కు సంబంధించినవి కాగా, చక్కెర, కందిపప్పు ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన వివరాలు లేకపోవడంపై మిగిలిన కేసులు నమోదయ్యాయి. వినియోగదారులను మోసగించి, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.


