విజయనగరం: అర్నాబ్ తీవ్ర తుఫాన్ జిల్లాను అంధకారం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో మంగళవారం నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. మంగళవారం వేకువజాము నుంచి తుఫాన్ ప్రభావం చూపించగా..రెండు రోజుల వ్యవధిలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్‌కు రూ.19.24 లక్షల నష్టం మిగిల్చింది. మంగళవారం, బుధవారం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా 115 విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోగా..వాటిలో 77 స్తంభాలను బుధవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. మిగిలిన స్తంభాలను పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా 28 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడవగా వాటిలో 20 ట్రాన్స్‌ఫార్మర్‌లను పునరుద్ధరించారు. మిగిలిన వాటిని మార్పు చేస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 1200 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.
తాగునీరు సరఫరా లేక ఇబ్బందులు
తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సుమారు నెల రోజుల క్రితం ఇదే తరహాలో వాయుగుండం రూపంలో భారీ వర్షాలు కురవడంతో సుమారు రూ.10.25 లక్షల నష్టం వాటిల్ల గా తాజాగా కురిసిన వర్షాలు అంతకన్నా ఎక్కువ నష్టాన్ని మిగిల్చాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ పరిధిలో తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టాలను నివారించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ సిబ్బందితో పాటు అదనంగా మరో 542 మంది సిబ్బందిని నియమించామని, వారితో నిరంతరం పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. బుధవారం సాయంత్రానికి 90 శాతం గృహ విద్యుత్ వినియోగదారులకు సరఫరాను అందించేలా కృషి చేస్తున్నామని, మిగిలిన సర్వీసులతో పాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసుల పునరుద్ధరణ ప్రక్రియను గురువారం పూర్తి చేస్తామని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్
ఈదురుగాలులతో నేలకొరిగిన 115 విద్యుత్ స్తంభాలు
భారీ వర్షాలతో పాడైన 28 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు
జిల్లా వ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో
అంధకారం
పునరుద్దరణ చర్యల్లో విద్యుత్ శాఖ అధికారులు


