నామినేషన్లకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు శ్రీకారం

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

విజయనగరం అర్బన్‌:

జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రిటర్నింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతోనే నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఆయా ప్రధాన పదవులకు వేర్వేరుగా నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు విజయనగరం కార్పొరేషన్‌లో మేయర్‌ స్థానానికి ఒక నామినేషన్‌ దాఖలవగా, నెల్లిమర్లలో చైర్‌పర్సన్‌ స్థానానికి రెండు నామినేషన్లు వచ్చాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 62 వార్డులకు, మేయర్‌ స్థానానికి వేర్వేరుగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 36 వార్డులకు, చైర్మన్‌ స్థానానికి, నెల్లిమర్ల నగర పంచాయతీలో 23 వార్డులకు, చైర్‌పర్సన్‌ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

● తొలిరోజు 35 నామినేషన్లు

తొలిరోజు విజయనగరం కార్పొరేషన్‌లో మేయర్‌ స్థానానికి ఒకటి, వార్డు సభ్యుల స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డు సభ్యుల స్థానాలకు ఆరు నామినేషన్లు వచ్చాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో చైర్‌పర్సన్‌ స్థానానికి రెండు, వార్డు సభ్యుల స్థానాలకు ఆరు నామినేషన్లు వచ్చాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో చైర్‌పర్సన్‌ స్థానానికి రెండు, వార్డు సభ్యుల స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి తొలిరోజు మొత్తం 35 నామినేషన్లు నమోదయ్యాయి.

ఎన్నికల షెడ్యూల్‌ ఇదీ..

ఈ నెల 18వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 28న పోలింగ్‌ జరగనుండగా అవసరమైన చోట 29న రీపోలింగ్‌ నిర్వహిస్తారు. 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

విజయనగరం నగరపాలక సంస్థలో నామినేషన్‌ స్వీకరణకు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘనలకు తావివ్వకుండదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

విజయనగరంలో మేయర్‌ స్థానానికి

ఒక నామినేషన్‌

నెల్లిమర్లలో

చైర్‌పర్సన్‌కు రెండు

విజయనగరం

కార్పొరేషన్‌,

బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర

పంచాయతీలో

ప్రారంభమైన

నామినేషన్‌

ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement