అమ్మ జాతరకు ప్రత్యేక సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

అమ్మ జాతరకు ప్రత్యేక సర్వీసులు

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

విజయనగరం క్రైమ్‌: పైడితల్లి అమ్మవారి జాతరకు ఆర్టీసీ 210 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ ప్రజా రవాణ అధికారిణి వరలక్ష్మి శనివారం తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు తిరుగుతాయన్నారు. ఆర్టీసీలో రోజువారీ వంద సర్వీసులతో పాటు అదనంగా 110 సర్వీసులను నడుపుతామని తెలిపారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్ధం అదనంగా ఆర్టీసీ పరంగా 15 మంది సిబ్బంది, పది మంది సూపర్‌వైజర్లను నియమించామని డీపీటీఓ తెలిపారు.

పీఎం, సీఎం చిత్రాల మూసివేత

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సోలార్‌ విద్యుత్‌ ఫ్లెక్సీలో పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఫొటోలు ఉన్న అంశంపై శనివారం ఎన్నికల కోడ్‌ వీరికి పట్టదా..? అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. పీఎం, సీఎం ఫోటోలను మూసి వేశారు.

ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి : డీఆర్‌ఓ

విజయనగరం ఫోర్ట్‌: 2026–27 ఖరీఫ్‌ ధాన్యం సేకరణ సజావుగా సాగేలా మిల్లర్లు సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి(డీఆర్‌ఓ) సిహెచ్‌.సత్తిబాబు కోరారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం రైస్‌ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ పక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు. బ్యాంక్‌ గ్యారంటీలను సమర్పించాలన్నారు. అవసరమైన గోనె సంచులను మందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణకు అవసరమైన వాహనాలు, హమాలీలు, ఇతర సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలన్నారు. మిల్లర్లు ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని సకాలంలో మర ఆడించి నిర్దేశిత పరిమాణంలో సీఎంఆర్‌ బియ్యాన్ని అందజేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ బి.శాంతి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ – ఢిల్లీ విమాన

సర్వీసు విస్తరణ

● సీఈవో కన్వర్‌బీర్‌సింగ్‌కల్రా

పూసపాటిరేగ: విశాఖపట్నం – ఢిల్లీ మధ్య ఆకాశ ఎయిర్‌ రోజువారీ విమాన సర్వీసులను ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ఫోర్టు లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కన్వర్‌బీర్‌సింగ్‌ కల్రా శనివారం ప్రకటించారు. ఈ కొత్త సర్వీసు ఆంధ్రప్రదేశ్‌, దేశ రాజధాని ఢిల్లీ మధ్య కనెక్టవీటి మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది ప్రయాణికుల ప్రయాణానికి మరిన్ని ఎంపికలను అందించడంతో పాటు ఈ ప్రాంతం నుంచి విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌కు మద్దతునిస్తుందన్నారు. విశాఖ–ఢిల్లీ మధ్య ఆకాశ ఎయిర్‌ రోజువారీ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం నగరంలోని అత్యంత ముఖ్యమైన దేశీయ విమాన మార్గాల్లో ఒకదానిపై కనెక్టవిటిని గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు. ఢిల్లీకి ఆకాశ ఎయిర్‌ రోజువారీ విమాన సర్వీసులు ప్రారంభంతో విశాఖపట్నం దేశ రాజధాని ఢిల్లీ మధ్య కనెక్టవిటిని బలోపేతం చేయడంలో ఒక మైలురాయి అన్నారు. త్వరలో విమానయాన సంస్థలతో భాగస్వాములను మరింత విస్తరించడం కీలక గమ్య స్థానాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రయాణికులకు మరింత సేవలు అందించే దిశలో ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement