● ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు
ఆటగాళ్లకు చోటు
వంగర: భారత్ అంధుల క్రికెట్ జట్టుకు వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన యువకుడు టొంపాకి దుర్గారావు ఎంపికయ్యాడు. శనివారం బెంగళూరులో భారతదేశం అంధుల క్రికెట్ సంఘం(సెబీ) 17 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో నవంబర్ 15వ తేదీ నుంచి రెండవ పురుషుల అంధుల క్రికెట్ ఆసియా కప్ పోరు జరగనుంది. ఢిల్లీలో నెల రోజులు పాటు జట్టు సభ్యులకు జరగనున్న శిక్షణలో దుర్గారావు ఉన్నారు. మారుమూల ప్రాంతం వంగర మండలం కొప్పరవలస గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన దుర్గారావు భారత అంధుల క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధప్రదేశ్ నుంచి మరో ముగ్గురు
భారత్ అంధుల క్రికెట్ జట్టులో ఉన్న 17 మంది సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన నలుగురు ఆటగాళ్లను సెబీ ప్రకటించింది. అందులో వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు, డి.వెంకటేశ్వరరావు (పలాస), ఎ.రవి(రాముడువలస, బొబ్బిలి మండలం), అశోక్‌రెడ్డి(గుంటూరు) ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.


