విజయనగరం రూరల్:
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల సమక్షంలో నిర్వహించిన పరిశీలనలో 4 జెడ్పీటీసీ, 11 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 254 జెడ్పీటీసీ, 2,566 ఎంపీటీసీ నామినేషన్లను అధికారులు ఆమోదించారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు 258 నామినేషన్లు దాఖలు కాగా, 254 ఆమోదం పొందాయి. చీపురుపల్లి డివిజన్‌లో 70 నామినేషన్లకు 69 ఆమోదం పొందగా, ఒకటి తిరస్కరించారు. విజయనగరం డివిజన్‌లో 132 నామినేషన్లకు 129 ఆమోదం పొందగా, మూడు తిరస్కరణకు గురయ్యాయి. బొబ్బిలి డివిజన్‌లో దాఖలైన 56 నామినేషన్లూ ఆమోదం పొందాయి. అలాగే జిల్లాలోని 449 ఎంపీటీసీ స్థానాలకు 2,577 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 2,511 ఆమోదం పొందగా, 66 తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు ఆదివారం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.
నామినేషన్ల తిరస్కరణలో అధికారుల
పక్షపాత ధోరణి
జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో అఽధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మండిపడ్డారు. పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన బొత్స చైతన్య నామినేషన్‌ను అధికారులు ఏకపక్షంగా తిరస్కరించడం సబబు కాదన్నారు. ఆయన ఓటు గరివిడి మండలం కోడూరులో నమోదై ఉన్నప్పటికీ అధికారులు సాంకేతిక కారణం చూపి తిరస్కరిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. దీనిపై కలెక్టర్ అప్పీలుకు వెళతామని అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే ఇదే అధికారులు ఓసీవర్గానికి చెందిన మజ్జి సిరిసహస్ర నామినేషన్‌ను బీసీ ధ్రువీకరణ పత్రంతో రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసినా అంగీకరించడం వారి పక్షపాత ధోరణిని ఎత్తి చూపుతుందన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
నామినేషన్లను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకుడు తేజ్‌భరత్
విజయనగరం రూరల్: స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో జిల్లా స్థానిక ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్‌భరత్ పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అఽఽధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
పీఓలదే కీలకపాత్ర
ఎన్నికల నిర్వహణలో పీఓలదే కీలక పాత్ర అని తేజ్‌భరత్ అన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్‌లో పీఓలకు, ఏపీఓలకు నిర్వహిస్తున్న తుది దశ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. వారి అవగాహన స్థాయిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలపై పీఓలకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని సూచించారు. ప్రతీ ప్రక్రియను నిబంధనల ప్రకారమే నిర్వహించాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తేజ్ భరత్ స్పష్టం చేశారు.
తిరస్కరించిన జెడ్పీటీసీ నామినేషన్లు
జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి 258 నామినేషన్లు దాఖలు కాగా, శనివారం స్క్రూట్నీలో అధికారులు 4 నామినేషన్లు తిరస్కరించారు. వీటిలో భోగాపురం నుంచి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిన జనసేన పార్టీ అభ్యర్థి మట్టా అయ్యప్ప రామకృష్ణారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించారు. అలాగే నెల్లిమర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భారతచైతన్య యువజన పార్టీ అభ్యర్థి చందక కృష్ణను బలపరచిన వ్యక్తి అదే మండలానికి చెందిన వారు కాకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. రేగిడి ఆమదాలవలస జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన గొట్టాపు రమ్య, పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన బొత్స చైతన్యల పేర్లు ఓటరు జాబితాలో లేదన్న కారణంతో తిరస్కరణకు గురయ్యాయి.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల
పరిశీలన పూర్తి
అప్పీళ్లకు నేటి వరకు
అవకాశం


