● కళ్లముందే జరిగిన ప్రమాదంలో తండ్రి మృతి
● కన్నీరుపెట్టిన కుమారుడు
దత్తిరాజేరు: నాన్నా.. లే నాన్నా... ఒక్కసారి కళ్లు తెరువు నాన్నా.. ఆస్పత్రికి తీసుకెళ్తాను... నిన్ను బతికించుకుంటాను.. అంటూ తండ్రి మృతదేహాన్ని పట్టుకుని కొడుకు పెట్టిన కన్నీరు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దమ్ము చిన్నోడు (58) అక్కడికక్కడే మృతి చెందాడు. పెదమానాపురం ఎస్సై కళాధర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కన మరమ్మతులకు గురై నిలిచిపోయిన లారీని మరో లారీ సహాయంతో పక్కకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ చిన్నోడు రోడ్డు దాటుతుండగా.. రామభద్రపురం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడిది ఎల్.కోట మండలం పోతంపేట గ్రామం. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించారు. కళ్లముందే తండ్రి మృతిచెందడంతో క్లీనర్ అయిన కుమారుడు దమ్ము అప్పలరాజు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


