ఆశ చూపి టోకరా | - | Sakshi
Sakshi News home page

ఆశ చూపి టోకరా

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

రామభద్రపురం: పేద, మధ్యతరగతి ప్రజల ఆశలను అలుసుగా చేసుకుని కొంతమంది ఇతర రాష్టాలకు చెందిన మోసగాళ్లు వ్యాపార అవతారమెత్తి ప్రజలను మోసగిస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేసి ఇంటికి కావాల్సిన సామగ్రి తక్కువ ధరలకు ఇస్తామని నమ్మబలికి ముందుగా వినియోగదారుల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బులు వసూలూ చేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన పలువురు యువకులు నెలరోజుల క్రితం మండలకేంద్రంలో ఓ దుకాణం అద్దెకు తీసుకున్నారు. అందులో వీపీఆర్‌ హోమ్‌ నీడ్స్‌ అండ్‌ ఆర్డర్‌ సప్లయర్స్‌ పేరిట బీరువాలు, మంచాలు, పరుపులు, ఫ్రిజ్‌లు, కుక్కర్లు కుర్చీలు తదితర ఇంటికి కావలసిన సామగ్రి పెట్టారు.అయితే ఆ సామగ్రిని ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకు విక్రయిస్తామని, ముందుగా డబ్బులు కడితే పది రోజుల్లో 40 శాతం నుంచి 50 శాతం వరకు ధర తగ్గించి సామగ్రి ఇంటికే సరఫరా చేస్తామని ఆటో ద్వారా ప్రచారం చేయడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేశారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడిన కొంతమంది వినియోగదారులు ముందుగా డబ్బులు చెల్లించగా వారికి 10 రోజుల్లో వారు బుక్‌ చేసుకున్న సామగ్రి ఇంటికి పట్టుకెళ్లి ముట్టజెప్పారు. దీంతో మరింత నమ్మకంపెంచుకున్న మరి కొంత మంది కొత్త వినియోగదాలరులు మరికొన్ని వస్తువులకు ముందుగానే డబ్బులు చెల్లించారు.ఆ డబ్బులతో మోసగాళ్లు ఉడాయించారు. అలాగే అవే సామగ్రి విజయనగరంలో ఓ హోమ్‌నీడ్స్‌ షాపు, మండలకేంద్రంలోని ఓ స్టీలు దుకాణం వద్ద కూడా ఆ మోసగాళ్లు ముందుగా డబ్బులు చెల్లించి వస్తువులు పట్టుకెళ్లడం చేసేవారు. కొద్ది రోజులు లావాదేవీలు జరిపి పూర్తిగా నమ్మకం కలిగించారు.ఆఖరికి ఆ దుకాణాదారులకు కూడా సుమారు రూ.2 లక్షల వరకు టోకరా పెట్టినట్లు తెలిసింది.అయితే బాధితుల్లో 10 మంది వరకు చెప్పేందుకు భయపడుతుండగా 15 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దుకాణానికి తాళం వేయడంతో పాటు బాధితుల వివరాలు సేకరించి మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు.

తక్కువ ధరకే ఇంటి వస్తు సామగ్రి ఇస్తామని నమ్మబలికి..

డబ్బులు వసూలు చేసి మోసగాళ్ల పరారీ

లబోదిబోమంటున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement