మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో ప్రసాద్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో ప్రసాద్‌ ప్రతిభ

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన జరజాన ప్రసాద్‌ శ్రీకాకుళం 1 డిపోలో ఆర్‌టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం, ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. 55 ఏళ్లు పైబడిన వారి విభాగంలో హైజంప్‌, లాంగ్‌ జంప్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం సాధించినట్లు ఆయన తెలిపారు.

అన్నదానానికి రూ లక్ష విరాళం

పాలకొండ: కోటదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం కోసం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కడియం చిరంజీవి దంపతులు రూ.లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ చెక్కును ఆలయ ఈవో వీవీ సూర్యానాయణకు అందజేశారు. పట్టణంలోని పలువురు భక్తులు అన్నదానం కోసం విరాళాలు అందించారు.

వేగావతిలో మునిగి జోడెద్దులు మృతి

బొబ్బిలిరూరల్‌: మండలంలోని గొర్లె సీతారాం పురం గ్రామస్తుడు మరడ ఈశ్వర్రావుకు చెందిన జోడెద్దులు ఆదివారం వేగావతి నదిలో మునిగి మృతిచెందాయి. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను వేగావతి నుంచి సేకరించేందుకు భోజరాజపురం వద్ద నదిలో ఎడ్ల బండిని దించగా నది ప్రవాహం, లోతైన ప్రాంతం కావడంతో బండి పూర్తిగా నీటిలో మునిగిపోయింది.బండిపై ఉన్న ఈశ్వర్రావు నదిలోకి దూకి ఒడ్డుకు చేరుకోగా ఎడ్లు నీటిలో పూర్తిగా మునిగి పోయి మృత్యువాత పడ్డాయి.దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు రూ.లక్షన్నర విలువైన జోడెద్దులు మృతి చెందగా ఇన్నాళ్లు తన కుటుంబ పోషణకు అండగా నిలిచిన ఎద్దులు మృత్యువాత పడడంతో లబోదిబో మంటున్నాడు. ఇన్నాళ్లూ వాటితో చేసిన సహవాసాన్ని గుర్తు చేసుకుని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమ వుతున్నారు.

పిచ్చికుక్క కరిచి ఆరుగురికి గాయాలు

జియ్యమ్మవలస రూరల్‌: మండలంలో ఒకేరోజు ఆరుగురిని పిచ్చికుక్క కరవడంతో గాయాలపాలయ్యారు. బాసంగి గ్రామానికి చెందిన జి. తిరుపతి నాయుడు, పి సీతారాం, సింగనాపురం గ్రామంలో ఎల్‌ లీలావతి, కిల్లాడ జానకి, పరజపాడు గ్రామానికి చెందిన బి మహిత, కుందరతిరువాడలో తవిటిన్నదొర ఆదివారం పిచ్చికుక్క దాడికి గురయ్యారు. వారిని స్థానిక చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా వైద్యుడు సీహెచ్‌ అభిజ్ఞ చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యాధికారి తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

భామిని: మండలంలోని మూలగూడకు చెందిన బిడ్డిక కృష్ణ(43) అనే గిరిజనుడు కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భామిని–లివిరి గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయిన కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి భామిని పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం తరువాత సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం వైజాగ్‌ కేజీహెచ్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తుండగా మృత్యువాత పడినట్లు కులుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య దమయంతి, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement