● ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
కొమరాడ: విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు వెళ్లే హెచ్‌పీసీఎల్ కంపెనీ క్రూడాయిల్ పైప్‌లైన్ పనుల్లో భాగంగా కొమరాడ మండలంలోని కెమిశీల,శిఖవరం, గాజులగూడ, నాయుడువలస, తులసివలస, కొట్టు,రాయిపురం తదితర గ్రామాల మీదుగా తవ్వకాలు చేపడుతున్నారు. అయితే పొలాల్లో పంట పూర్తిస్థాయిలో పెరిగి చేతికొచ్చే దశలో ఉన్న సమయంలో జేసీబీలతో తవ్వకాలు జరుపుతుండడంపై రైతులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను కోసే సమయం దగ్గర పడుతున్న తరుణంలో తవ్వకాలు చేపట్టడం వల్ల తమకు త్రీవనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకోతకు సిద్ధంగా ఉన్న సమయంలో యంత్రాలతో పొలాలను తవ్వడంతో వల్ల పంటనష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం అప్పుల చేసి వ్యవసాయం చేస్తున్నా రైతులకు పంటనష్టం జరిగితే ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.ఒక వైపు వ్యవసాయం పెట్టబడులు పెరిగిపోతుండగా మరో వైపు పంట చేతికొచ్చే సమయంలో ఇటువంటి తవ్వకాలు చేపట్టడం తమ జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు.
పంట కోతల వరకు తవ్వకాలు వాయిదా వేయాలి
పైప్‌లైన్ పనులు చేపట్టే మందు రైతులకు తగిన సమాచారం అందించి పంట కోత పూర్తయ్యే వరకు తవ్వకాలు వాయిదా వేయాలని తప్పనిసరిగ్గా పనులు చేపట్టాల్సి వస్తే ముందుగా కనీసం పంటనష్టాన్ని అంచనా వేసి న్యాయమైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు క్షేత్రస్ధాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిశీలించాలని పంటనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారి జీవనోపాధికి నష్టం కలగకుండా పైప్‌లైన్ పనులు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహారం
అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలు నిండు పంటపొలాలపై తవ్వకాలు జరపడం దారుణం. కనీసం సమాచారం లేకుండా క్షేతస్ధాయిలో రైతులు సమావేశం కానీ, పంచాయతీ తీర్మానం కానీ లేకుండా తమ ఇష్టారాజ్యం వ్యవహరించడంపై రైతులతో కలిసి పోరాటం చేస్తాం. – తాడంగి భీమయ్య,
మాజీ సర్పంచ్, కెమిశీల పంచాయతీ


