విజయనగరం ఫోర్ట్: మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ కాంట్రాక్ట్ మెడికల్, హెల్త్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్.స్వాతి, కో కన్వీనర్ శ్రీనివాసరావు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజు శనివారం కూడా సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె వల్ల పేద రోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరిస్తే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తామన్నారు. ఆందోళనలో కాంట్రాక్ట్ మెడికల్, హెల్త్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో జాప్యంపై నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు
వైద్య ఉద్యోగులు
యువకుడి అదృశ్యం
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి పట్టణంలో సుంకర దినేష్‌కుమార్(22) అనే యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గరివిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక కుటుంబ సభ్యులతో కలిసి దినేష్‌కుమార్ నివాసం ఉంటున్నాడు. నెల్లిమర్లలోని మిమ్స్ కళాశాలలో ఫిజియోథెరపి కోర్సు చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన దినేష్‌కుమార్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటుగా బంధువుల ఇళ్ల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు దినేష్‌కుమార్ తండ్రి సుంకర సుధాకర్ గరివిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు
రాజాం సిటీ: రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన కాయల శివుడు కనిపించడం లేదని అతని భార్య లక్ష్మి ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ మహ్మద్ సల్మాన్‌బేగ్ శనివారం తెలిపారు. పశువుల వ్యాపారం చేస్తున్న శివుడు ఈ నెల 8న సమీప బంధువైన కాయల సాంబయ్యతో కలిసి పశువుల విక్రయానికి రాజాం వచ్చారు. పని పూర్తయిన తరువాత సాంబయ్య స్వగ్రామం చేరుకోగా శివుడు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


