ఆ మాత్రం లేవా? | - | Sakshi
Sakshi News home page

ఆ మాత్రం లేవా?

Oct 10 2026 12:34 AM | Updated on Oct 10 2026 12:34 AM

ఆ మాత్రం లేవా? ●తక్కువగా ఉంటేనే...

రోగులకు సగం మందులే ఇస్తున్నారు..

సర్వజన ఆస్పత్రిలో రోగుల అవస్థలు

వైద్యులు రాసిన మందులు పూర్తి స్థాయిలో ఇవ్వని వైనం

ప్రైవేటు షాపుల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి

విజయనగరం ఫోర్ట్‌:

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు డి.వరలక్ష్మి. ఈమెది విజయనగరం పట్టణంలోని తోటపాలేం గ్రామం. తన భర్త ఆదినారాయణకు పార్కిన్‌సెన్స్‌ అనే వ్యాధి ఉండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చూపించారు. అతడిని పరీక్షించిన వైద్యులు వ్యాధి తగ్గడానికి పలు రకాల మందులు రాసి ఇచ్చారు. అవి పట్టుకుని మందుల గది వద్దకు వెళ్లారు. వైద్యులు రాసిన మందుల్లో సగమే అక్కడ సిబ్బంది ఇవ్వడంతో ఎందుకు తక్కువ ఇచ్చారని అడగడంతో మందులు తక్కువ ఉన్నాయి, అందుకే తక్కువ ఇచ్చానని చెప్పడంతో చేసేది లేక ఇంటికి వెళ్లి పోయారు. మిగతా మందులు ప్రైవేటు మందుల దుకాణంలో రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేశారు.

విజయనగరం కామాక్షినగర్‌కు చెందిన కన్నా అనే వ్యక్తి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతను కూడా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులను ఆశ్రయించాడు. ఓపీ చీటిపై జబ్బునయమయ్యేందుకు అవసరమైన మందులు రాసి ఇచ్చారు. ఇతనికి కూడా సగం మందులు ఇచ్చారు. దీంతో నిరాశతో వెనుదిరిగారు.

వీరు ఇద్దరికే కాదు. వందలాది మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వాస్పత్రి అయిన సర్వజన ఆస్పత్రిలో మందులు లేకపోవడం రోగులు, వారి బంధువులను ఆవేదనకు గురిచేస్తోంది. అప్పుచేసి ప్రైవేటు దుకా ణాల్లో మందులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ఆస్పత్రిలో ఓపీ 1200 నుంచి 1400 వరకు నమోదవుతుంది. ఇన్‌పేషేంట్లుగా 100 మంది వరకు చేరుతారు. వైద్యులు రోగులను పరీక్షించి మందులు రాసినా పూర్తిస్థాయిలో ఇవ్వక పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యులు 60 రాస్తే 30 మాత్రలు, 90 రాస్తే 50 మాత్రలు, 30 రాస్తే 15 మాత్రలు ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రోగుల ఆరోగ్యం పట్ల చంద్రబాబు సర్కార్‌ చిన్నచూపు చూస్తోందని విమర్శిస్తున్నారు.

వైద్యులు సూచించిన ప్రకారం మందులు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. మందులు తక్కువగా ఉంటే ప్రస్తుతం కొన్ని ఇచ్చి కొద్ది రోజుల తర్వాత మళ్లీ రమ్మని మిగిలినవి ఇస్తారు.

– డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement