ప్రభుత్వ సాయమేది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సాయమేది

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

రాజాం:

ఇల్లు.. పేదవాడి జీవిత కల. దానికోసం కూలి డబ్బుల నుంచి రూపాయిరూపాయి పోగు చేస్తారు. కలల సౌథం నిర్మించుకోవాలని ఇంటిల్లిపాదీ తాపత్రయపడతారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది మంది పేదల కల నెరవేరింది. స్థలం, ఇంటి నిర్మాణ సాయం పక్కాగా అందడంతో పేదలు ఒక ఇంటివారయ్యారు. ఏ ఊరు వెళ్లినా జగనన్న కాలనీలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చి న వెంటనే పేదలకు రెండుసెంట్లు ఇంటి స్థలం, రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారు. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణం పేదలకు భారంగా మారింది.

● పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు

గత రెండు నెలల కిందటి వరకూ సిమెంట్‌ బస్తా ధర రూ.260 నుంచి రూ.280ల మధ్య ఉండేది. ఈ మధ్యకాలంలో బస్తాపై రూ.20లు పెరిగింది. ఇప్పుడు బస్తా ధర రూ.300లు పలుకుతోంది. ఇందులో ఓపీసీ గ్రేడ్‌ సిమెంట్‌ రూ.320ల పైబడి ఉంది. ఒక చిన్నపాటి శ్లాబ్‌ ఇంటి నిర్మాణం పూర్తికావాలంటే సుమారు 500 బస్తాల సిమెంట్‌ అవసరం. కేవలం సిమెంట్‌కే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణదారుడు రూ.1.60 లక్షల మేర డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ధరలతో పోల్చితే ఒక్కో సిమెంట్‌ బస్తాపై రూ.70లు పెరుగుదల కనిపిస్తోంది.

● గతంలో టన్ను ఐరన్‌ ధర రూ.60వేల నుంచి రూ.61 వేల మధ్య ఉండేది. గత రెండేళ్ల కిందట టన్ను ధర రూ.45 వేలు నుంచి రూ. 50 వేల మధ్య కొనసాగేది. ఇప్పుడు టన్నుకు ఏకంగా రూ.24 వేల వరకూ పెరుగుదల వచ్చింది. చిన్నపాటి ఇంటి నిర్మాణానికి రెండు నుంచి రెండున్నర టన్నుల ఐరన్‌ అవసరం. దీనికోసం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇసుక కోసం మరో రూ.1.20లక్షలు ఖర్చుచేయాల్సి వస్తోంది.

ఇటుకల ధరకు రెక్కలు

గతంలో ఇళ్ల నిర్మాణాలు అధికంగా ఉండడంతో ఎక్కడికక్కడే ఇటుక పరిశ్రమలు ఉండేవి. విరివిగా అమ్మకాలు ఉండడంతో ఇటుకలు ధర ఒక మార్జిన్‌లో వెళ్లేది. బంకమట్టి ఇటుక ట్రాక్టర్‌ లోడ్‌ (2000 ఇటుక) రూ.8వేలకు తెచ్చి విక్రయించేవారు. ఇప్పుడు నిర్మాణాలు లేక, ప్రభుత్వం ఇల్లు మంజూరుచేయక ఇటుక పరిశ్రమలు తగ్గుముఖం పట్టాయి. ఉన్న కొద్దిపాటి ఇటుక పరిశ్రమలు వద్ద ఇటుకలు ప్రతికూల పరిస్థితులు తట్టుకుని తయారీ చేస్తుండడంతో వీటి ధర గతంలో కంటే పెరిగింది. బట్టీలు వద్దే ట్రాక్టర్‌ ఇటుకల ధర రూ. 10 వేలు దాటుతోంది. చిన్న ఇల్లు నిర్మాణానికి ఇటుకల కోసం రూ.1 లక్ష వరకూ వెచ్చించాల్సి వస్తోంది.

పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు

సిమెంట్‌ బస్తా రూ.300

గతంలో కంటే రూ.20లు పెరుగుదల

ఓపీసీ గ్రేడ్‌ సిమెంట్‌ రూ.320

టన్ను ఐరన్‌ ధర రూ.74వేలు

గతంలో కంటే రూ.13 వేలు పెరుగుదల

ఇంటి నిర్మాణాలకు సామాన్యులు వెనుకంజ

ప్రభుత్వం నుంచి అందని ఇంటి సాయం

పేదలకు కష్టాలు

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పేదలకు అన్ని విధాలా కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు సంక్షేమ పథకాలు అందడం లేదు. మరోవైపు ఇంటి స్థలం, నిర్మాణానికి ఆర్థిక సాయం అందని ద్రాక్షగా మారాయి. స్థానిక ఎన్నికల నేథప్యంలో ఇల్లు ఇస్తామంటూ పేర్లు, జిరాక్స్‌లు సేకరించడం ఇల్లు మంజూరు కనిపించడంలేదు.

– కరణం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌, మజ్జిరాముడుపేట, రేగిడి మండలం

పేదలు ఇబ్బందులు పట్టడం లేదు..

సిమెంట్‌, ఐరన్‌ ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడంలేదు. పేదలు సొంతిల్లు నిర్మించుకోవడం భారంగా మారింది. ఇంటి నిర్మాణ ముడిసరుకుల ధరలకు ప్రభుత్వం కళ్లెం వేయడంలేదు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.

– వాకముల్ల చిన్నంనాయుడు, మాజీ సర్పంచ్‌,

అంతకాపల్లి, రాజాం మండలం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతీ పేదవానికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించింది. ఇంటిని నిర్మించుకోలేని వారికి నిర్మించి ఇచ్చేది. కుటుంబం కష్టపడితే రూ.2.50 లక్షలు పెట్టుబడికి తమకు నచ్చినవిధంగా పేదలు ఇంటిని నిర్మించుకునేవారు. అప్పట్లో తాపీమేసీ్త్ర వేతనం రోజుకు రూ. 500లు ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ. 850 నుంచి రూ.1000 కి చేరింది. కూలీల ధర రూ. 500లు పైబడే ఉంది. పెరిగిన ధరలు, ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో పేదలు, చిన్న, సన్నకారు కుటుంబాలు ఇంటి నిర్మాణం ఆలోచనను విరమించుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement