● పాస్ పుస్తకాల్లో తప్పుల నమోదుతో రైతుల ఆందోళన
● తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన కొట్టక్కి దళిత రైతులు
రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం భూముల రీ సర్వేలో అందిస్తున్న పాస్ పుస్తకాలు, జారీ చేసిన వన్‌బీల్లో తప్పుల నమోదుతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తప్పులు సరిచేయాలంటూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామంటూ ప్రచారం చేసి... ఇప్పుడు తప్పుల తడకగా జారీ చేయడంపై మండిపడుతున్నారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన 60 మంది రైతులకు సర్వే నంబర్ 537లో ఎకరా చొప్పున 2005–06 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పగించారు. డీ పట్టాలు మంజూరు చేశారు. ఆ భూమికి సంబంధించిన సర్వే గత వైఎస్సార్‌సీ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ సర్వేను ఆపేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయకుండా నిలిపేసింది. ఇటీవల తప్పులుగా ముద్రించిన పాస్‌పుస్తకాలను ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సీపీఐ జిల్లా నాయుకుడు అలమండ ఆనందరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వన్‌బీలో తప్పులను సరిచేయాలని తహసీల్దార్ అజూరఫీజాన్‌కు వినతిపత్రం అందజేశారు.


