● పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రమూర్తి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో గడిచిన మూడు రోజుల నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం యాగశాలలో మూడు రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త హోమాలు, సుందరకాండ హోమాలకు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలోని ఉత్సవమూర్తుల వద్ద స్వామి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా జరిపించి శ్రీరామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, వర ప్రసాద్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


