బెట్టింగ్‌ల కోసం బైక్‌ల చోరీ | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ల కోసం బైక్‌ల చోరీ

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

బెట్టింగ్‌ల కోసం బైక్‌ల చోరీ

● ఇద్దరు నిందితుల అరెస్ట్‌

విశాఖ: క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి, వాహన చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.10.65 లక్షలు విలువైన 21 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ద్వారకా సబ్‌–డివిజన్‌ క్రైం సీఐ వి.చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసరావుతో కలిసి గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. సత్యం జంక్షన్‌ నివాసి వెంపటాపు షణ్ముఖ తన ఇంటి ముందు గత నెల 6న బైక్‌ పార్క్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీనిపై ఆయన ఈ నెల 15న క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరికొన్ని మోటార్‌ సైకిల్‌ చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుల ఫోన్‌ నంబర్లను గుర్తించారు. కాకినాడ జిల్లా తిరుమలి గ్రామానికి చెందిన గుదే రాంబాబు, హైదరాబాద్‌ బాలానగర్‌ ప్రాంతానికి చెందిన జిడ్డు పవన్‌ ఈ బైక్‌లను దొంగిలించినట్లు తేల్చారు. వారిని అదుపులోకి విచారించగా, వారు ఎక్కడెక్కడ వాహనాలు దొంగిలించింది బయటపడింది. నిందితులిద్దరూ స్నేహితులని, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. గత మూడు నెలలుగా వీరు ద్వారకా, ఎంవీపీ, ఎయిర్‌పోర్టు, గాజువాకతో పాటు కాకినాడ, ఎలమంచిలి, రామభద్రపురం, ఖమ్మం తదితర ప్రాంతాలలో బైక్‌లను దొంగిలించి, తక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 21 ద్విచక్ర వాహనాలను ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణకు తరలించామని, తదుపరి చర్యల నిమిత్తం వాటిని కోర్టుకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. గురువారం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement