● పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ
చీపురుపల్లి రూరల్ (మెరకముడిదాం):
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మెరకముడిదాం మండలం గర్భాంలో బుధవారం నిర్వహించిన మండల విస్త్రతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మనపై ఉందన్నారు. గ్రామాల్లో నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారి సమ స్యలు తెలుసుకోవాలని, సాధ్యమైన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే తనను ఫోన్‌లో సంప్రదించాలని, సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు భోరోసా ఇచ్చారు.
● కార్యకర్తలకు గుర్తింపు కార్డులు..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చీపురుపల్లి నియోజకవర్గంలో 11,700 మంది క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారన్నారు. ఆపద సమయాన రూ.5 లక్షల ఆర్థిక సదుపాయం సైతం కల్పించారన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ అండగా ఉండాలనే మానవతా దృక్పథంతోనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, భవిష్యత్తులో ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
● మెరకముడిదాం మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని బొత్స స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సుజల స్రవంతి పథకాన్ని తీసుకువచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. 2029లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పథకాన్ని తీసుకువచ్చి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తుఫాన్ గాలివలే రాజకీయాల్లోకూడా అప్పుడపుపడు చిన్నచిన్న గాలులు రావడం, పోవడం సహజమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో కళావెంకటరావు, సినీనటుడు బాలకృష్ణ ఈప్రాంతానికి వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, ఆక్రమణలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు చేశారని.. ఇప్పుడు అదే వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు నీతివంతుడయ్యాడా అంటూ ఎద్దేవా చేశారు.
సమష్టిగా సాగుదాం
పార్టీ జిల్లా అధ్యక్షుడు, పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించేలా అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు మోసపోయారని విమర్శించారు. మహిళలకు సున్నా వడ్డీలేదు. రుణమాఫీ వర్తింపజేయడంలేదు. నెలనెలా ఇస్తామన్న రూ.15 వందలు ఇవ్వడంలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. రైతులకు ఎరువులు, విత్తనాలు లేవు. ప్రకృతి వైపరీత్యాల్లో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష, బొత్స సందీప్, పార్టీ మండలాధ్యక్షుడు కేవీఆర్‌కే ప్రసాద్(రాము), నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణు, కృష్ణవేణి, చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండల నాయకులు మీసాల వరహాలనాయుడు, ఇప్పిలి అనంతం, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, కె.వి.సూర్యనారాయణరాజు, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, అంబళ్ల శ్రీరాములునాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


