సర్కారుతో
పూసపాటిరేగ:
భోగాపురంలో ఎయిర్‌పోర్టు పేరుతో ఇప్పటికే 900 ఎకరాలు సేకరించారు... మళ్లీ డేటా సెంటర్ పేరుతో మరో 350 సేకరణకు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు... ఇలా అయితే రైతులందరూ జీవనాధారం కోల్పోయి నిరాశ్రయులుగా మిగులుతారు.. బతుకు మార్గం ఉండదు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలి... అప్పటివరకు ఉద్యమం ఆగదు.. తాడోపేడో తేల్చుకుంటామంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపారు. భోగాపురం బజారు కూడలి నుంచి వందలాది మంది రైతులు భోగాపురం మెయిన్‌వీధి, పంచాయతీ కార్యాలయం, సినిమా థియేటర్, జిల్లాపరిషత్ పాఠశాల, జాతీయరహదారి మీదుగా తహసీల్దార్ కార్యా లయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుల ఆందోళనతో తహసీల్దార్ కార్యాలయం తలుపులు వేయడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. డేటా సెంటర్ నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పేరిట నిరుపేదల భూములు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న జిరాయితీ భూముల సేకరణకు ఎలా నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించారు. భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, తమ అభ్యంతరాలను రెవెన్యూ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. భూ సేకరణ నిర్ణయం వెనుకకు తీసుకునేవరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన కొమ్మూ రు సుభూషణరావు, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, దేవ పుష్పలత, పడాల భానుప్రకాష్, శిరుగుడు వాసుదేవరావుతో పాటు గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
భోగాపురంలో డేటా సెంటర్‌కు
భూ సేకరణకు వ్యతిరేకంగా
కదంతొక్కిన రైతులు
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
జీవనాధారమైన భూములను లాక్కుంటే బతికేది ఎలా అంటూ
ఆవేదన
చంద్రబాబు సర్కారు తీరుపై ఆగ్రహం


