అమ్మకానికి భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ.. | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికి భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ..

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

విజయనగరం ఫోర్ట్‌: ‘ఏరుదాటే వరకు ఏరు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చంద్రంగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు. అధికారంలోకి రావడం కోసం జామి మండలంలోని భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తాం... చెరకు రైతులను ఆదుకుంటాం.. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రస్తుత సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఊరూరా ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నారు. తీరా... అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో జిల్లాకు ఒక్క పరిశ్రమను తెచ్చిన దాఖలాలేవు. ఇప్పుడు భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఏకంగా అమ్మకానికి పెట్టేసింది. వచ్చిన డబ్బులతో రైతులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు జీఓ 250ను జారీచేసింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులకు మేలు చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టడం పట్ల రైతులు మండి పడుతున్నారు. జిల్లాలో ఉన్న మంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఫ్యాక్టరీలో వేలాది మంది రైతులు షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. ఒకవేళ సుగర్‌ ఫ్యాక్టరీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహాజన సభ ఏర్పాటు చేసి రైతులందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలి. కాని చంద్రబాబు సర్కార్‌ రైతుల ఆమోదం లేకుండా, ఏకపక్షంగా అమ్మకానికి పెట్టేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది అన్యాయం..

ప్రభుత్వం సుగర్‌ ఫ్యాక్టరీని, భూమిని, ఇతర ఆస్తులను అమ్మకానికి పెట్టడం అన్యాయం. చక్కెర కర్మాగారాలు నష్టాల్లో ఉన్నాయనే సాకును చూపి అమ్మే యడం సరికాదు. వాటిని ఆధునీకరించి, పరిపాలనా లోపాలను సరిచేయాలి. నిధులు వెచ్చించి ఫ్యాక్టరీ తెరిపించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న 29 ఫ్యాక్టరీల్లో 27 మూతపడ్డాయి. పరిశ్రమలు అమ్మకానికి పెట్టడం దారుణం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం.

– బుద్దరాజు రాంబాబు,

ఏపీ రైతు సంఘం కార్యదర్శి

ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని

తెరిపిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ..

ఇప్పుడు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి

అప్పులు తీర్చేందుకు సర్కారు నిర్ణయం

స్పందించని మంత్రి

ఆవేదనలో రైతాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement