● ఆస్తి కోసం సొంత తమ్ముడి అకృత్యాలు ● అన్న దివ్యాంగుడిని గెంటేసే కుట్ర ● న్యాయం కోసం కలెక్టరేట్ మెట్లెక్కిన బాధితుడు
పార్వతీపురం రూరల్: దివ్యాంగుడినైన నన్ను, నా భార్యాపిల్లలను రోడ్డున పడేసేందుకు నా సొంత తమ్ముడే దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఇంట్లో తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా నానా అవస్థలకు గురిచేస్తున్నాడు. అని పార్వతీపురం మండలం సుడిగాం గ్రామానికి చెందిన గొరజాన నరేంద్రనాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కోసం కన్నవారే తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ను ఆశ్రయించారు.బాధితుడు నరేంద్రనాయుడు తెలిపిన వివరాల ప్రకారం..ఆయనకు తాతగారు 1999 మార్చి 10న రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ ద్వారా ఒక పెంకుటిల్లు ఇచ్చారు. సుమారు 26 ఏళ్లుగా ఆ ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ ఆయన తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. తల్లిదండ్రులకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ, సోదరుడు జగదీశ్వరరావు తన కుటుంబంతో వచ్చి నరేంద్రనాయుడి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ ఇల్లు తనదేనని పెద్దల ముందు బుకాయిస్తూ, తన పేరున విద్యుత్ మీటరు తెప్పించి, దివ్యాంగుడినైన తనను కొట్టేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితుడు వాపోయాడు. మరోవైపు, నరేంద్రనాయుడి దివ్యాంగత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జీవనాధారంగా తండ్రి మధుసూదనరావు, తమ్ముడు జగదీశ్వరరావు కలిసి 2018 ఏప్రిల్ 4న గ్రామ పెద్దల సమక్షంలో స్థిరాస్తి అయిన పల్లం భూమిని రెండు ఎకరాలు రాసిచ్చారు. అప్పటి నుంచి ఆ భూమిపై వచ్చే ఫలసాయంతోనే ఆయన కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే, ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న రీ–సర్వేను ఆసరాగా చేసుకుని, ఆ భూమిని కూడా తన తమ్ముడు, తండ్రి వారి పేర్లపై రాయించుకునేందుకు సిద్ధపడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి, భూమి పత్రాలు తన పేరుపైనే ఉన్నప్పటికీ తనపై దౌర్జన్యం చేస్తుండడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు ఏమాత్రం స్పందించలేదని ఆయన వాపోయాడు. విధిలేని పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని కోరుతూ పార్వతీపురం సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఆయన వినతిపత్రాలు సమర్పించాడు. సదరు పల్లం భూమిని రీ–సర్వేలో తన పేరున నమోదు చేసి పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని, తన వారి దౌర్జన్యం నుంచి రక్షణ కల్పించి తన ఆస్తి తనకు దక్కేలా చూడాలని నరేంద్రనాయుడు అధికారులను వేడుకుంటున్నాడు.


