కళాకు క్యాంప్‌ ఫైర్‌..! | - | Sakshi
Sakshi News home page

కళాకు క్యాంప్‌ ఫైర్‌..!

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

తిరుగుబావుటా ఎగురవేసిన

మెరకముడిదాం టీడీపీ నేతలు

పూర్వం నుంచి పార్టీలో ఉన్నా

గుర్తింపు లేదంటూ అసంతృప్తి

కళా వెంకటరావు నిర్ణయానికి

వ్యతిరేకంగా ప్రత్యేక క్యాంప్‌

9 మంది ఎంపీటీసీలతో పొరుగు రాష్ట్రంలో క్యాంప్‌ పెట్టిన తాడ్డి సన్ని

నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్న ఎమ్మెల్యే ‘కళా’ వెంకటరావు

చీపురుపల్లి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌తో నేను సమకాలీనుడిని. ఆయన నేను కలిసి ఒకే టేబుల్‌పై భోజనం కూడా చేసేవారం. టీడీపీ ఆవిర్భావంలో ఎన్నో సంక్షేమ పథకాల రూపకల్పనలో నా భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుత నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా నాకంటే పార్టీలో జూనియర్‌ అంటూ ఎన్నో సమావేశాల్లో చెబుతున్న మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మాట చెల్లడం లేదా? ఆయన నిర్ణయాలకు సొంత పార్టీ నేతల నుంచే గౌరవం లభించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉండి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ నిన్నగాక మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వయాన కోడలి ఓటమిని తట్టుకోలేక మధనపడుతున్న తరుణంలో నియోజవకర్గంలోని మెరకముడిదాం మండలం టీడీపీ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడంతో కళావెంకటరావు వైభవం చీపురుపల్లి నియోజక వర్గంలో మసకబారుతోంది. ఎంపీపీ విషయంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాక్షాత్తు ఆ పార్టీ మెరకముడిదాం మండల అధ్యక్షుడు, తాజా జెడ్పీటీసీ భర్త, సీనియర్‌ నాయకుడు తాడ్డి సన్యాశినాయుడు(సన్ని) పొరుగు రాష్ట్రంలో ప్రత్యేక ‘క్యాంప్‌’ ఫైర్‌ రగిలించారు. దీంతో ఈ టాపిక్‌ జిల్లా వ్యాప్తంగా హాట్‌హాట్‌గా మారి చర్చనీయాంశమవుతోంది.

9 మంది ఎంపీటీసీలతో క్యాంప్‌..

మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు తాడ్డి సన్యాశినాయుడు అదే పార్టీకి చెందిన 9 మంది ఎంపీటీసీలతో, ఎమ్మెల్యే ‘కళా వెంకటరావుకు తెలియకుండా పొరుగు రాష్ట్రంలో ప్రత్యేక క్యాంప్‌ పెట్టిన విషయం గురువారం ఉదయానికి గుప్పుమంది. బుధవారం రాత్రి 9 మంది ఎంపీటీసీలను తీసుకుని సోమలింగాపురం ఎంపీటీసీ నానితో కలిసి పొరుగు రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది. మెరకముడిదాం మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో కూటమి అభ్యర్థులు 14 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందగా వారిలో 9 మంది ఎంపీటీసీలను తీసుకుని ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ రహస్య క్యాంప్‌ బెంగళూరులో నడుస్తోందని కొంతమంది చెబుతుండగా ఒడిశాలో ఉందని మరికొంత మంది చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా..

మెరకముడిదాం మండల ఎంపీపీగా కోట్ల మోతీలాల్‌నాయుడు పేరును ఎమ్మెల్యే కళా వెంకటరావు ఎన్నికల ముందే ప్రకటించారు. మోతీలాల్‌నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో చేరారు. గత రెండున్నరేళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీపీగా, సీనియర్‌ నాయకుడిగా టీడీపీ అనగానే మెరకముడిదాం మండలంలో గుర్తచ్చేది తాడ్డి సన్యాశినాయుడి పేరు. అలాంటి సన్యాశినాయుడు ఎంపీపీ పదవిని తనకివ్వాలని ఎమ్మెల్యేను కోరినప్పటికీ కుదరదని జెడ్పీటీసీగా పోటీకి దిగాలని ఎన్నికల ముందు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీపీ ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ జెడ్పీటీసీ పోటీకి వెళ్లేందుకు ఇష్టం లేని సన్యాశినాయుడు కొద్ది రోజులు తాత్సారం చేశారు. ఇంత

లో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా మరొకరి పేరు కూడా పంపినట్లు ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైందో గానీ సన్యాశినాయుడు భార్యతో జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించి గెలుపొందారు. తనకు జరిగిన అవమానానికి ఎమ్మెల్యేకు దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైన సన్యాశినాయుడు 9 మంది ఎంపీటీసీలను తీసుకుని క్యాంప్‌కు వెళ్లారు.

పట్టు కోల్పోతున్న ఎమ్మెల్యే..

పార్టీ ఇంకా రెండున్నరేళ్లు అధికారంలో ఉంటుంది, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ స్వయాన ఆయన కోడలు గరివిడి జెడ్పీటీసీగా ఓటమి పాలవడంతో పాటు గరివిడి మండలంలోని ఎంపీటీసీలను కూడా వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. అలాగే గుర్ల మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా వైఎస్సార్‌సీపీకి దక్కడంతోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టు కోల్పోతున్నట్లు చర్చ మొదలైంది. దీనికి తోడు మెరకముడిదాం మండలంలో ఇలా సొంత పార్టీ నాయకులే ఆయనను ఎదిరించి ఎంపీటీసీలను ప్రత్యేక క్యాంప్‌కు తీసుకెళ్లిపోవడంతో ఆ చర్చలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎన్నో చోట్ల కూటమిలో రెబల్స్‌ బరిలో ఉన్నప్పటికీ వారిని బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరిచుకునే విధంగా చర్యలు చేపట్టడంలో కూడా విఫలమయ్యారనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement