● ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లకు తావివ్వొద్దు ● అధికారులకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు
విజయనగరం రూరల్: జిల్లాలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్న మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ), కో–ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించి, ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీవోలు, జెడ్పీ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 19న మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు, న20న జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజుల్లో కో– ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయన తెలిపారు.ఎన్నికల సమావేశాలకు హాజరు కావాల్సిందిగా గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ ఈ నెల 14 లోగా లేదా అంతకంటే ముందుగానే నోటీసులు అందజేయాలని అధికారులకు సూచించారు.
కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు అర్హతలు
ఎన్నికల ప్రక్రియలో ముందుగా కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మతపరమైన మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు, అలాగే తెలుగు భాష మినహా ఇతర భాషలను మాతృ భాషగా కలిగిన వారు భాషాపరమైన మైనారిటీలుగా అర్హులవుతారని వివరించారు. కోఆప్టెడ్ సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారు, తమ మైనారిటీ అర్హతను ధ్రువీకరించే పత్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యే లేదా గెజిటెడ్ అధికారి నుంచి పొంది సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్
నవంబర్ 19న నిర్వహించే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు లేదా ఫారం అ, ఆ లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు.అదేవిధంగా నవంబర్ 20న నిర్వహించే జెడ్పీ కోఆప్టెడ్ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలకు కూడా ఇదే విధమైన సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు.
కోరం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల సమావేశాలకు అవసరమైన కోరం గెలుపొందిన సభ్యులలో సగం మంది హాజరుతో ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత సమయానికి కోరం లేని పక్షంలో ఒక గంట వరకు వేచి చూడాలని, అప్పటికీ కోరం సమకూరకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేయాలని సూచించారు. మరుసటి రోజు కూడా ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితుల్లో తదుపరి ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు.ఎన్నికల సమావేశాలకు సంబంధిత సభ్యులు, నిబంధనల ప్రకారం అర్హులైన ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతర వ్యక్తులను అనుమతించరాదని స్పష్టం చేశారు. సంబంధిత మండలానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, మండలం లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చని తెలిపారు.ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం చేపట్టాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లకు, లోటుపాట్లకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, జెడ్పీ సీఈవో కిరణ్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో లవరాజు, ఎంపీడీవోలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి


