గుర్ల: మండలంలోని కెల్ల హైస్కూల్ విద్యార్థులు సామంతుల కుసుమాంజలి, కర్రోతు దివ్యశ్రీ బాలికల విభాగంలో, గుత్తి లక్ష్మణరావు బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీడీ సత్యనారాయణ గురువారం తెలిపారు. వారు ఈనెల 14 నుంచి 16 వరకు గుడివాడలో జరగబోయే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఖోఖో పోటీలకు ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం లీలాకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.
మహిళకు తీవ్ర గాయాలు
బొబ్బిలి: పట్ణణంలోని ముస్లిం వీధికి చెందిన షేక్ రజియాబేగం అనే మహిళ గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగుతుండగా డ్రైవర్ లాగించేయడంతో తీవ్రంగా గాయపడింది. దీనిపై స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఒక బస్సు ఎక్కాల్సింది పోయి మరో బస్సు ఎక్కి ఆమె దిగుతోంది. ఈ విషయంలో డ్రైవర్‌కు బస్సు ఆపమని చెప్పి ఆమె దిగిపోతుండగా డ్రైవర్ ఒక్కసారిగా లాగించేయడంతో మోకాళ్ల కింద భాగాలు దెబ్బ తిన్నాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
విజయనగరం ఫోర్ట్: నిమోనియా వ్యాధి వల్ల సంభవించే మరణాలు తగ్గించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిమోనియాపై రుపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టరేట్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈనెల 12 వతేదీ నుంచి 28వతేదీ వరకు నిమోనియా వ్యాధిపై అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమోనియా వ్యాధి లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. నిమోనియా వ్యాధికి సకాలంలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, జెడ్పీ సీఈఓ కిరణ్‌కుమార్, డిప్యూటీ సీఈఓ లోవరాజు, డ్వామా పీడీ శారదాదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, డీఎల్‌ఓ డాక్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
బొలెరో ఢీకొని యువకుడి మృతి
విజయనగరం టౌన్: విజయనగరం మండలంలోని కోరుకొండ కొత్తూరుకి చెందిన జి.రాకేష్ (21) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాకేష్ తన బైక్‌ను వీటీ అగ్రహారం పాత కోర్టు సమీపంలో ఉన్న వాటర్ వాష్ చేయించుకున్నాడు. తిరిగి తన బైక్‌ను గురువారం రాత్రి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. హెల్మెట్‌ను పెట్టుకోకుండా బైక్‌కు తగిలించుకుని, డివైడర్ దాటి అవతలి రోడ్డువైపు దాటే ప్రయత్నంలో అటునుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ తల డివైడర్‌కు బలంగా తగిలి తీవ్రరక్తస్రావమైంది. వెంటనే స్థానికులు కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది క్షణాల్లోనే మృతిచెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం దక్కేదని స్థానికులు చెబుతున్నారు. ఇంటి పెద్దకొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదుతో రూరల్ ఎస్సై వెలమల ప్రసాదరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురెదురుగా బైక్‌ల ఢీ:
ఇద్దరికి గాయాలు
పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండల పరిధిలోని కొత్తపల్లి రైస్‌మిల్లు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బలిజిపేట మండలం పెద్ద అరసాడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న మహేశ్వరరావు, అలాగే పార్వతీపురం నుంచి వస్తున్న వసాది ప్రసాద్‌ల బైక్‌లు కొత్తపల్లి కూడలి వద్ద ఢీకొన్నాయి. మహేశ్వరరావు గరుగుబిల్లిలోని శివ సాయిబాబా గుడి వద్ద ప్రైవేట్ ఎలక్ట్రీషియనన్‌గా పనిచేస్తుండగా, వసాది ప్రసాద్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వృత్తిపరమైన పనుల మీద వెళ్లి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ద్విచక్ర వాహనదారులిద్దరికీ గాయాలు కాగా, చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.


