● పార్టీలో చేరిన వారలో ఐటీడీపీ ఇన్చార్జ్ షన్ముఖరావు ● ఆహ్వానించిన వైఎస్సార్‌సీపీ రాజాం ఇన్‌చార్జ్ డాక్టర్ తలే రాజేష్
రాజాం: మున్సిపల్ ఎన్నికల వేళ రాజాం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజునే పట్టణంలోని డోలపేటకు చెందిన వంద టీడీపీ కుటుంబాల వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజాంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ చేరికల నిర్వహించారు. డోలపేటకు చెందిన రాజాం టీడీపీ ఐటీడీపీ ఇన్‌చార్జ్ గులివిందల షన్ముఖరావుతో పాటు మరో వందకుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తలే రాజేష్ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పార్టీలో చేరినవారంతా సమన్వయంతో ఉండాలని, రాజాం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. ఇప్పుడు కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో మంచి భరోసా ఉంటుందని వెల్లడించారు. పార్టీలో చేరిన షన్ముఖరావుతో పాటు మరికొంతమంది మాట్లాడుతూ టీడీపీలో వ్యక్తిగత ప్రయోజనాలు అధికమయ్యాయని, సామాన్యులకు న్యాయం జరగడంలేదని, దందాలు, దోపిడీలు అధికమవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో తామంతా పార్టీని మారుతున్నామన్నారు. డోలపేట ప్రజలకు న్యాయం చేయడంలో టీడీపీ విఫలమైందని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టణంలో గెలిపించి, టీడీపీ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గ పార్టీ యువజనవిభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


