బాడంగి: విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన బైక్ దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బొబ్బిలి రూరల్ సీఐ మల్లికార్జునరావు, బాడంగి ఎస్సై సూర్యకుమారి, సిబ్బంది గణేష్, రమేష్ బృందం దొంగలను అదుపులోకి తీసుకోవడం పాటు 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల వివరాలను డీఎస్పీ బి. గోవిందరావు బాడంగి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బైక్‌లను దొంగలిస్తున్న సాలూరు మండలం బాగువలసకు చెందిన కందుకూరి అనిల్ (దావీద్)తో పాటు అతనికి సహకరిస్తున్న సాలూరు దాసరివీధికి చెందిన అన్నదమ్ములు ఎం.వెంకటరమణ, ప్రవీణ్‌లను పోలీసులు రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో పట్టుకున్నారు. వీరికి సహకరిస్తున్న ఒక మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించగా.. విశాఖకు చెందిన శ్రీరామ్, ప్రసన్న అనే ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా బాడంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, విజయనగరం రూరల్‌లో–1, టౌన్‌లో–2, విశాఖ మహారాణిపేటలో–4, పీఎంపాలెంలో–2, భీమిలి, పద్మనాభంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 బైక్‌లను చోరీ చేశారు. ఇందులో 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బొబ్బిలి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.


