పత్తి రైతుకు కష్టకాలం..! | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు కష్టకాలం..!

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

రాజాం: పత్తి రైతుకు కష్ట కాలం వచ్చింది. పంట చేతికందినా స్థానికంగా విక్రయించుకోలేని దుస్థితి. రెండేళ్ల కిందటి వరకు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల వద్ద నవంబర్‌ నుంచి మే నెల వరకు పత్తికొనుగోలు చేయడంతో పాటు ఇక్కడి గోదాంలలో దాచుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇతర జిల్లాలో పత్తి పంటకు డిమాండ్‌ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం పత్తిపంటను కొనుగోలుచేసేవారే కరువయ్యారు.

● తగ్గిన సాగు

ప్రభుత్వ చర్యలతో గతేడాది నుంచి పత్తిపంట సాగును రైతులు తగ్గిస్తున్నారు. 2024 ఖరీఫ్‌లో జిల్లాలో 6 వేల ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా గతేడాది 5,100 ఎకరాలకు పరిమితమైంది. ఈ ఏడాది 4,600 ఎకరాల్లోనే సాగైంది. ఇటీవల కురిసిన తుఫాన్‌ వర్షాలతో పత్తిపంట నాశనమైంది. చేతికందిన అరకొర పంటను కూడా కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.

● రైతుకు దక్కని మద్దతు ధర

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 2026–27 సీజన్‌కు పత్తి పంట క్వింటాకు రూ.8,267లు మద్దతు ధర ప్రకటించింది. అయితే, ఆ ధరకు జిల్లాలో కొనుగోళ్లు జరగడంలేదు. పత్తిని వేరుచేయడం నుంచి భద్రపరచడం వరకు శ్రమతో కూడిన సున్నితమైన పని. తేమ లేకుండా చూసుకోవాలి. పత్తి సాగుకు పెట్టుబడి కూడా అధికమే. ఎకరాకు కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. గత్యంతరం లేక వ్యయప్రయాసలకోర్చి గుంటూరు జిల్లాకు తరలించి పత్తి పంటను విక్రయిస్తున్నారు. అయితే, అక్కడ క్వింటా రూ.9వేల పైబడి ధర పలుకుతున్నట్టు చెబుతున్నారు.

నాణ్యతే ప్రామాణికం

పత్తి పంటలో ప్రధానంగా నాణ్యతను ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ప్రస్తుతం పండిస్తున్న పత్తిపంట మొదటి పూత నాణ్యతగా ఉంటుంది. పత్తికాయలు పెద్దవిగా రావడంతో పాటు పత్తి కూడా తెల్లగా ఎటువంటి పుప్పులేకుండా దిగుబడి వస్తుంది. తొలి పర్యాయం పత్తి ఎక్కువ దిగుబడి రావడంతో పాటు నాణ్యత కూడా ఉంటుంది. మార్కెట్‌ యార్డులో పత్తికొనుగోలు కేంద్రం సిద్ధంచేశాం. ఇక్కడకు వచ్చిన రైతులను రామభద్రపురం జిన్నింగ్‌ మిల్లు వద్దకు విక్రయాలు నిమిత్తం పంపిస్తున్నాం.

– కె.శ్రీనివాసరావు, రాజాం ఏఎంసీ కార్యదర్శి

దిగుబడి తగ్గింది..

ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గింది. స్థానికంగా కొనుగోలు కేంద్రం లేదు. ఇతర ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉంది. ఇక్కడ పండిన పంటను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నాం.

– బెవర వెంకటరమణ, రైతు, కంచరాం,

రాజాం మండలం

దళారీలకు విక్రయిస్తున్నాం..

పత్తి పంట ఒకే దఫా కోతకు రాదు. నాలుగు నుంచి ఆరు పూతలు వస్తాయి. తొలి, మలి పూత దశల్లో వచ్చిన పత్తికాయలు నాణ్యంగా ఉంటాయి. వీటికే మంచి ధర ఉంటుంది. రాజాంలో పత్తికొనుగోలు కేంద్రంలో సేకరణ లేక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. మద్దతుధర అందడం లేదు.

– ఎ.వెంకటలక్ష్మి, పొనుగుటివలస,

రాజాం మండలం

కానరాని

మద్దతుధర

ప్రారంభంకాని కొనుగోలు కేంద్రం

గుంటూరుకు

తీసుకెళ్లి

విక్రయించాల్సిన దుస్థితి

ఈ ఏడాది జిల్లాలో 4,600 ఎకరాల్లో పత్తి సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement