విజయనగరం గంటస్తంభం:
ఖరీఫ్ 2026–27 సీజన్ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ డీఎం బి.శాంతి, వ్యవసాయ శాఖ జేడీ రామారావు సంబంధిత సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం సేకరణపై మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో వారు మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.2,441, గ్రేడ్–ఏ రకానికి రూ.2,461 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నవంబర్‌లో 15 వేల మెట్రిక్ టన్నులు, డిసెంబర్‌లో 1.77 లక్షలు, జనవరిలో 1.68 లక్షలు, ఫిబ్రవరిలో 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పారు. దీనికోసం 80 లక్షల పాత గన్నీ బ్యాగులు, 53 లక్షల కొత్త గోనెసంచులు సమకూరుస్తున్నామని, కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, తేమ కొలిచే మీటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నవంబర్ 11 నుంచి మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు.
రైతు ఐడీ తప్పనిసరి..
ప్రభుత్వానికి ధాన్యం విక్రయించే ప్రతి రైతుకు ఆధార్‌తో లింక్ అయిన 20 అంకెల ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని జేడీ రామారావు స్పష్టం చేశారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ధాన్యం రవాణాకు మండలాల వారీగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా నూరుశాతం పూర్తి చేయాలన్నారు. క్రాప్ కటింగ్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించి ఫారం–1 ఫ్లాట్ సెలెక్షన్‌ను రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాజాం డివిజన్‌లో ఇప్పటికే కోతలు ప్రారంభమైనందున 15 రోజుల్లో సేకరణకు పరిస్థితులు అనుకూలిస్తాయని, విజయనగరం, కొత్తవలస ప్రాంతాల్లో డిసెంబర్ మొదటి వారం నుంచి ముమ్మరం కానుందని పేర్కొన్నారు. ధాన్యంలో తేమ శాతం, తాలు, చెత్త వంటి ఎఫ్‌ఏక్యూ నాణ్యతా ప్రమాణాలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని, తద్వారా మిల్లుల వద్ద తిరస్కరణ సమస్యలు తెలత్తకుండా చూడాలని సూచించారు.
బకాయిలు చెల్లించాల్సిందే....
ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఏపీఈఎస్, ఐఎఫ్‌ఎంఎస్‌లలో పెండింగ్‌లో ఉన్న ఎరువుల లావాదేవీల బకాయిలను, మార్కెట్ కమిటీ డ్యూస్‌లను నవంబర్ 15వ తేదీలోగా నూరు శాతం క్లియర్ చేయాలని జేడీ ఆదేశించారు. గడువు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేత్ బచావో అభియాన్‌ను విజయవంతం చేయాలని, ప్రతి రైతు సేవా కేంద్రం(ఆర్‌ఎస్‌కే) వద్ద అధికారిక క్యూఆర్ కోడ్ పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మురళీనాథ్, ఉద్యాన అధికారి చిట్టిబాబు, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారులు, ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఖరీఫ్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం కొనుగోలే లక్ష్యం
రైతు ఐడీ తప్పనిసరి.. వాహనాల
రిజస్ట్రేషన్లు వేగవంతం చేయాలి
కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై ముగిసిన జిల్లా స్థాయి శిక్షణ


